పంచాంగం...బుధవారం, 18.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.షష్ఠి రా.7.57 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తర ప.2.07 వరకు తదుపరి హస్త వర్జ్యం రా.10.17 నుంచి 11.50 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు..లేవు.

హేవళంబి నామ సంవత్సర ఫలితాలు

28th March 2017 7:00am

పంచాంగ సారాంశం 

 • తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతాయి. ఈ పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది.
 • చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ హేవళంబినామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 31 వది. ఈ హేవళంబినామ సంవత్సరం. అధిపతి అగ్ని, అగ్నిని ఆరాధించిన సకల సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
 • మే 4 అనగా వైశాఖ శుద్ధ నవమి గురువారం నుంచి మే 28వ తేదీ జ్యేష్ఠ శు.చవితి ఆదివారం వరకు కర్తరి కాలం, ఈ కాలంలో శంకు స్ధాపనలు,గృహ నిర్మాణాలు చేయరాదు.
 • అక్టోబర్ 12 గురువారం నుంచి నవంబర్ 9 వరకు గురు మూఢమి.
 • మార్చి 30తో శుక్ర మూఢమి సమాప్తమవుతుంది. తిరిగి నవంబర్ 28 నుంచి 19 ఫిబ్రవరి (2018) వరకు శుక్రమూఢమి ఉంటుంది. ఈకాలంలో వివాహాది శుభముహూర్తాలు ఉండవు.
 • మకర సంక్రాతి    జనవరి 2018,14వ తేదీ ఆదివారం,అనగా పుష్య బహుళ త్రయోదశి, ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మకర రాశిలో రాత్రి 7.01 గంటలకు రవి ప్రవేశంతో కావేరీ నదికి పుష్కరాలు ప్రారంభం. కర్ణాటక, తమిళనాడులో కావేరీ నదీ తీరంలో స్నానాదులు ఆచరించి,తర్పణాలు,దానాలు ఇవ్వడం మంచిది.
 • గ్రహణాలు ఆగస్టు 7వ తేదీ సోమవారం, శ్రావణ పౌర్ణిమ రోజు రా. గం. 10. 53కు కేతు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సంభవిస్తుంది. శ్రవణం నక్షత్రం వారు,మకర రాశివారు దీనిని చూడరాదు.
 • 2018 జనవరి 31 తేదీ బుధవారం మాఘ పౌర్ణిమ రోజు సా. 5.19 గంటలకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది. పుష్యమి,ఆశ్లేష నక్షత్రాల వారు, కర్కాటక రాశి వారు చూడరాదు.

సంవత్సర ఫలితాలు..

 • ఈ సంవత్సరం రాజు-బుధుడు, గురువు-మంత్రి- శుక్రుడు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి - గురువు, పూర్వ సస్యాధిపతి -చంద్రుడు, అపర సస్యాధిపతి-శని, రసాధిపతి- కుజుడు,నీరసాధిపతి-రవి. 
 • నవ నాయకుల్లో ఆరుగురు శుభులు,మిగతా ముగ్గురు పాపులు. అలాగే, ఉప నాయకుల్లోని 21మందిలో 14 మంది శుభులు,మిగతా వారు పాపులు.
 • బుధుడు రాజు,మంత్రి శుక్రుడు కావడం వల్ల కేంద్ర,రాష్ట్రాలలో సుపరిపాలన కొనసాగుతుంది. ఇరువురు శుభులు, మిత్రులు కావడంతో దేశ ఖ్యాతి నలుదిశలా వ్యాపించి పాలకులకు విశేష గుర్తింపు రాగలదు.
 • కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు,చర్యలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి సంక్షేమం దిశగా పథకాలు ప్రారంభిస్తారు.
 • కొన్ని సందర్భాలలో సైనిక చర్యలకు అవకాశం ఉంటుంది. వృద్ధ నేతలకు కొంత గడ్డుకాలమనే చెప్పాలి. విద్య,పారిశ్రామిక రంగాలు పుంజుకుంటాయి. శాస్త్ర ,సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కి పరిశోధనలు వేగవంతం చేస్తాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతాయి.
 • రైతులకు మంచి రోజులుగా భావించవచ్చు. పంటలు విశేషంగా పండుతాయి. శ్రావణంలో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా పరిపుష్టిని సాధిస్తాయి.
 • పెద్ద పదవుల్లో ఉన్న నేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు కొంత ఇబ్బందిగా ఉంటాయి.  
 • కళారంగం వారికి అత్యంత యోగదాయకమైన కాలం. ముఖ్యంగా సినీ,నాటక రంగాల వారికి పేరు ప్రతిష్టలు, గౌరవంతోపాటు, గొప్ప అవార్డులు దక్కుతాయి.
 • అత్యున్నత స్ధాయి పదవులకు మహిళలు ఎంపిక కావచ్చు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్ని సంస్ధల్లో సంక్షోభం తొలగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయి.
 • శని ప్రభావం వల్ల బస్సు,రైళ్లు,విమాన ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే సూచనలు. అలాగే, నవంబర్,డిసెంబర్ నెలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించ వచ్చు. కొన్ని రాష్టాలలో పాలకులు మారతారు.
 • ఇక ఈ సంవత్సర రాహు ప్రభావం కారణంగా భయోత్పాతాలు, రోగ పీడలు, భూకంపాలు సూచిస్తున్నాయి. ప్రజలు రాహు దోష నివారణ పూజలు,దుర్గామాతకు అర్చనలు చేయడం ఉత్తమం.
 • ఇక బుధుడు రాజు కావడం వల్ల మూడు తూముల వర్షం. ఇందులో 8 భాగాలు సముద్రలోనూ, 9భాగాలు పర్వత ప్రాంతంలోనూ, 3 భాగాలు భూమి యందు కురుస్తుంది.
 • ఈ ఏడాది వర్ష లగ్నం మేషం, జగర్లగ్నం కుంభమైనది. వీటిని పరిశీలించగా పాలకుల మధ్య సహకారం ఉంటుంది. ఉన్మాదులు, ఉగ్రవాదులు తమ ప్రతాపాన్ని చూపే వీలుంది. ఈ ఏడాది పాలు, పాల ఉత్పత్తులు మరింతగా పెరుగుతాయి.
 • ఆగస్టు - నవంబర్ మధ్య కాలంలో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉద్యమాలు, ఆందోళనలతో కొంత అశాంతి నెలకొనే అవకాశం ఉంది.
 • అపరాల ఉత్పత్తులు పెరిగి మంచి గిరాకీ ఏర్పడుతుంది. కొన్ని వ్యాధులు ప్రబలి ప్రజలకు సమస్యగా  మారవచ్చు. అయితే ప్రభుత్వాలు తగు రీతిలో స్పందించడంతో ఊపిరి పీల్చుకుంటారు.
 • వైశాఖం, జ్యేష్ఠ మాసాలలో గాలి దుమారాలు,వడ గండ్ల వర్షాలు పడే అవకాశం ఉంది.
 • ఈ ఏడాది పశుపాలకుడు బల రాముడు, గోష్టప్రాపకుడు, గోష్ఠబహిష్కర్త శ్రీ కృష్ణుడు కావడం వల్ల పశు సంపద, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.
 • వచ్చే ఏడాది శ్రీ విళంబినామ సంవత్సరం.
 • నవనాయకుల ఫలాలు..
 • రాజు-బుధుడు కావడం వల్ల అపరాల ఉత్పత్తులు పెరుగుతాయి. శిల్పులు, రచయితలకు మంచి గుర్తింపు రాగలదు. అలాగే, చింతపండు, వేరుసెనగ, పత్తి, రసాయన ఎరువులు, తేయాకు, గోధుమలు వంటి వాటి  ధరలు పెరుగుతాయి.
 • మంత్రి- శుక్రుడు కావడం వల్ల సస్యములకు తెగుళ్లు, గేదెలు, ఆవులకు రోగ పీడలు తద్వారా మానవులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ధాన్యాల ధరలు కొంత తగ్గుతాయి. వర్షాలతో జలాశయాలకు జల కళ వస్తుంది. పాలనలో అవరోధాలు తొలగుతాయి.  స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది.
 • సేనాధిపతి- గురువు కావడం వల్ల రాజులు, ప్రజలు న్యాయవర్తులై మసలుతారు. ప్రజలకు అనుగుణమైన పాలన అందుతుంది. గ్రామాలకు అభివృద్ధి కళ ఉట్టిపడుతుంది. యుద్ధ భయాలు తొలగుతాయి.
 • సస్యాధిపతి (పూర్వ) – చంద్రుడు కావడం వల్ల మాగాణి, మెట్ట పంటలు బాగా పండుతాయి. చింతపండు, మామిడి, గోధుమలు, తమలపాకులు, చెరకు ధరలు సరసముగా ఉంటాయి.
 • ధాన్యాధిపతి- శని కావడం వల్ల మినుములు, నువ్వులు, అవిసెలు మొదలగు నల్ల ధాన్యాలు బాగా పండుతాయి  అలాగే, నల్లరేగడి భూములలో పంటలు మరింతగా పెరుగుతాయి.
 • అర్ఘాధిపతి- గురువు కావడం వల్ల. యజ్ఞయాగాదులతో ప్రజలు సత్ప్రవర్తనతో మసలుతారు. ఈతి బాధలు తొలగుతాయి. దేశంలో శాంతియుత వాతావరణ ఏర్పడుతుంది. అలాగే, కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 • మేఘాధిపతి- గురువు కావడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారు. వ్యాధుల బారి నుంచి బయటపడతారు. ధరలు సమాన స్ధాయిలో ఉంటాయి. వర్షాలు సకాలంలో కురిసాయి.
 • రసాధిపతి- కుజుడు కావడం వల్ల ఉప్పు, నెయ్యి, నువ్వులనూనె, బెల్లం వంటి రస వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయి. మద్యం వంటి వాటి ధరలు మరింత పెరుగుతాయి.
 • నీరసాధిపతి- రవి కావడం వల్ల చందనం, వెండి, బంగారం, రాగి మొదలగు లోహముల ధరలు పెరుగుతాయి.
 • పలు రాష్ట్రాలలో ఘర్షణలు, కలహాలతో ప్రజల మధ్య వైషమ్యాలు ఏర్పడతాయి. 

Also Read