పంచాంగం...బుధవారం, 18.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.షష్ఠి రా.7.57 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తర ప.2.07 వరకు తదుపరి హస్త వర్జ్యం రా.10.17 నుంచి 11.50 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు..లేవు.

ఉగాది రాశి ఫలాలు

29th March 2017 3:40am

ఉగాది రాశి  ఫలాలు : (29-03-2017 - 17-03-2018)

మేషం

వీరికి సెప్టెంబర్‌12 నుంచి గురుడు శుభుడు. ఉగాది నుంచి సెప్టెంబర్‌ వరకూ గురు, రాహు, కేతువులు పాపులు. జూన్‌ నుంచి అక్టోబర్‌వరకు శని తిరిగి అష్టమ స్థానంలో సంచారం. మొత్తం మీద సెప్టెంబర్‌ నుంచి గురు బలం వల్ల అనుకూల స్థితి ఉంటుంది. ఈతి బాధలు, సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు.సోదరులు, బంధువుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికపరమైన ఒత్తిడులు, అవసరాలు పెరుగుతాయి. అయితే హఠాత్తుగా సొమ్ము అందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చికాకులు తప్పక పోవచ్చు. ముఖ్యంగా ఎముకలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. నిరుద్యోగుల ఆశలు సెప్టెంబర్‌ నుంచి నెరవేరతాయి. మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం తో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి మీ అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సెప్టెంబర్‌ నుంచి  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి పరిశోధనలు ఫలించి గుర్తింపు రాగలదు.  వ్యాపారాలు కొంత వరకూ లాభిస్తాయి.పెట్టుబడుల విషయంలో కొంత నిదానం అవసరం. ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆగస్టు తరువాత ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది, కొత్త సంస్థలను ప్రారంభిస్తారు. రాజకీయవర్గాలకు ప్రధమార్థంలో సమస్యలు ఎదురైనా అక్టోబర్‌ నుంచి అనుకూల స్థితి. కళాకారులకు ఈ ఏడాది గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులకు రుణాలు, పెట్టుబడులు సమకూరతాయి. మొదటి పంట లాభదాయకం.  జూన్‌–నవంబర్‌ మధ్య కాలంలో  శని ప్రభావం (అష్టమంలో వక్రగతిన శని సంచారం) వల్ల కొన్ని ఇబ్బందులు, ఉద్యోగ మార్పులు, ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

పరిహారాలు...శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు పారాయణ చేయాలి.

అదృష్ట సంఖ్య–9,

ఆది, బుధ, గురువారాలు అనుకూలం.

ఆదాయం– 5 వ్యయం–5,రాజపూజ్యం– 3, అవమానం–1


వృషభం

ఈ రాశి వారికి ఆదాయవ్యయాలు, రాజపూజ్యాదులు బాగున్నా గ్రహ సంచారం రీత్యా కొన్ని ఇబ్బందులు తప్పక పోవచ్చు. జనవరి నుంచి జూన్‌వరకు, తిరిగి అక్టోబర్‌26నుంచి సంవత్సరాంతం వరకూ అష్టమ శని, ఆగస్టు 17వరకు అర్థాష్టమ రాహు ప్రభావాలు అధికం. అయితే సెప్టెంబర్‌ వరకు గురు బలం వల్ల కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద వీరికి  లేనిపోని చికాకులు. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా నరాలు, నేత్రం, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

ఆగస్టు నుంచి రాహు దోషం తొలగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణ దాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

 కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడమే కాకుండా సభ్యులతో కలహాలు ఏర్పడతాయి. బంధువులు మీ పై అపవాదులు, నిందలు మోపుతారు.

వాహనాలు నడిపే వారు మెలకువ పాటించాలి.  చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. శాస్త్ర, సాంకేతికరంగాల వారికి కార్తీకం, మార్గశిర మాసాల్లో విశేష గుర్తింపు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఆగస్టు తర్వాత ఫలించే సూచనలు. ఇంటి నిర్మాణ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడుల కోసం కొంత శ్రమించాలి. కొద్దిపాటి లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు ఊహించని బదిలీలు ఉంటాయి. విధుల్లో అవాంతరాలు ఎదురు కావచ్చు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. సంవత్సరాంతంలో పదవీయోగం. కళాకారులకు శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు. వ్యవసాయదారులకు సామాన్య స్థితి. రెండవ పంట కొంత అనుకూలిస్తుంది. జ్యేష్టం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. 

వీరు శని, రాహువులకు పరిహారాలు చేయాలి. శివునికి, ఆంజనేయస్వామికి పూజలు ఫలితాన్నిస్తాయి.

అదృష్ట సంఖ్య–6 

బుధ, శనివారాలు అనుకూలం.

ఆదాయం– 14, వ్యయం–11,రాజపూజ్యం– 6 అవమానం–1


మిథునం

ఈ రాశివారికి గురువు విశేష యోగకారకుడు. మిగతా గ్రహాల సంచారం సామాన్యం. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. రాబడి ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధువర్గం నుంచి విమర్శలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. అనుకున్న వ్యవహారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన హామీలు వద్దు. ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు అధిగమిస్తారు. ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు ఏర్పడినా క్రమేపీ అనుకూలత ఉంటుంది..ఇంటి నిర్మాణ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. శ్రావణం, ఆశ్వయుజ మాసాల్లో వివాహాది శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ఇతరుల  పొగడ్తలకు లొంగి పోవద్దు. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయితే ఆగస్టు నుంచి  ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొత్త పదవులు దక్కుతాయి.  కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు పెట్టుబడులు అందుతాయి. ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, మాఘ మాసాలు నెలలు అనుకూలం, మిగతావి సామాన్యం. వీరు శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.

అదృష్ట సంఖ్య 5, సోమ, గురు, శనివారాలు అనుకూలం.

రాహు, కేతువులకు పరిహారాలు శివాభిషేకాలు, దుర్గా స్తోత్ర పారాయణ చేయండి.

ఆదాయం–2, వ్యయం–11,రాజ పూజ్యం–2, అవమానం–4.

కర్కాటకం

ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని మాత్రమే కొంత అనుకూలిస్తాడు. గురు, రాహు, కేతువులు దోషకారులు. మొత్తం మీద వీరికి సామాన్య ఫలితాలు ఉంటాయి. రాబడి ఉన్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. చేపట్టిన కార్యాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఎదురవుతాయి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సెప్టెంబర్‌తరువాత అనుకూలిస్తాయి. వాహనాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు ఆగస్టు తర్వాత ఫలిస్తాయి.  సెప్టెంబర్‌ నుంచి శుభకార్యాల హడావిడిలో నిమగ్నమవుతారు. ఆస్తుల వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. అయితే సెప్టెంబర్‌ నుంచి కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు సంభవం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఎదురైన సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాల వారికి జూన్‌ తరువాత అనుకూల పరిస్థితి. కొత్త పదవులు ఎట్టకేలకు సాధిస్తారు. కళాకారులు అనుకున్నది సాధించడంలో మరింత శ్రమపడాలి. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రెండవ పంట అనుకూలం. భాద్రపదం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. అలాగే, మాసశివరాత్రి రోజున శివునికి అభిషేకం, దుర్గ, సుబ్రహ్మణ్యేశ్వరుల ఆరాధన మంచిది.

అదృష్ట సంఖ్య –2, బుధ, శుక్ర, ఆదివారాలు అనుకూలం.

ఆదాయం–11, వ్యయం–8,రాజ పూజ్యం–5, అవమానం–4.


సింహం

వీరికి  జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు అర్థాష్టమ శని ప్రభావం ఉంటుంది. సెప్టెంబర్‌ వరకు గురు బలం విశేషం. మొత్తం మీద వీరికి కొంత కాలం సామాన్య స్థితి ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. అలాగే, సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.  మీ ఆశయాల సాధనలో కుటుంబ సభ్యులు చేయూతనిస్తారు. వివాహయత్నాలు సఫలమవుతాయి. వ్యవహారాలు క్రమేపీ పూర్తి కాగలవు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత మేరకు పరిష్కారమవుతాయి. అక్టోబర్‌ నుంచి వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. జూన్‌–నవంబర్‌ మధ్య కాలంలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురుకావచ్చు.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం, పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు. రాజకీయవర్గాలకు జూన్‌ లోగా పదవీ యోగం. కళాకారులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.  విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. చైత్రం, జ్యేష్ఠ, శ్రావణం, మార్గశిర, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, రుద్రాభిషేకాలు చేయించుకోవాలి.

అదృష్ట సంఖ్య–1

ఆది, మంగళ, గురు, శనివారాలు అనుకూలం.

ఆదాయం–14, వ్యయం–2,రాజపూజ్యం–1, అవమానం–7

కన్య

వీరికి సెప్టెంబర్‌ నుంచి గురువు, ఆగస్టు నుంచి రాహువు అనుకూలురు. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని యోగదాయకుడు. తదుపరి సంవత్సరాంతం వరకూ శని అర్థాష్టమ స్థానంలో సంచారం.  సెప్టెంబర్‌ వరకూ అనుకున్న కార్యాలలో విఘ్నాలు. బంధుమిత్రులతో విభేదాలు నెలకొంటాయి. శ్రమ వృథా కాగలదు.  కోర్టు కేసులు, ఆస్తి వివాదాల నుంచి కొంత వరకూ ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యంగా చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు సొమ్ము అందడం కొంత ఊరటగా చెప్పవచ్చు. సెప్టెంబర్‌ నుంచి గురువు, ఆగస్టు నుంచి రాహువుల బలం కారణంగా కార్యజయం. శుభకార్యాల నిర్వహణ, ఆకస్మిక ధన లబ్ధి వంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి. సమర్థత చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు.  రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  పారిశ్రామికవర్గాల వారు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి.  శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. కళాకారులకు సంతోషకరమైన సమాచారాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వ్యవసాయదారులకు లాభసాటిగానే ఉంటుంది. అక్టోబర్‌ నుంచి తిరిగి అర్ధాష్టమ శని వల్ల ఈతి బాధలు, మానసిక అశాంతి. కుటుంబంలో కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి.వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, కార్తీక మాసాలు అనుకూలం, మిగతావి సామాన్యం.

వీరు గురు, శనులకు పరిహారాలు చేయించుకోవాలి. తిల దానం మంచిది.

అదృష్ట సంఖ్య–5, సోమ, గురు

శనివారాలు అనుకూలం. 

ఆదాయం–2, వ్యయం–11,రాజపూజ్యం–4, అవమానం–7


తుల

వీరికి అక్టోబర్‌ నుంచి ఏల్నాటి శని ప్రభావం పూర్తిగా తొలగుతుంది. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని వక్రగతిన  వృశ్చిక రాశిలో సంచారం కొంత దోషకారకమైనా ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదంతా గురువు దోషకారే. ఇక రాహువు ఆగస్టు వరకు శుభుడు. మొత్తం మీద చాలావరకూ అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలమైనా అవసరాలరీత్యా రుణాలు చేయాల్సి వస్తుంది. అలాగే, ఖర్చులు కూడా పెరుగుతాయి.  ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కారమయ్యే  అవకాశం ఉంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. కొన్ని ఒప్పందాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతులు సంభవం. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకుల ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. మొదటి పంట మరింత లాభిస్తుంది. శాస్త్రసాంకేతిక రంగాల వారు పరిశోధనల్లో సాధించిన విజయాలు మరుపురానివిగా ఉంటాయి. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని ధన స్థానంలో సంచారం వల్ల ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వృథా ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థికంగా హామీలు వద్దు.వివాదాలకు దూరంగా ఉండండి. జ్యేష్ఠం, భాద్రపదం, కార్తీకం, పుష్యం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శని, గురునికి పరిహారాలు చేయించుకోవాలి. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలి.

అదృష్ట సంఖ్య 6, సోమ, బుధ

శుక్రవారాలు అనుకూలం.

ఆదాయం–14, వ్యయం–11,రాజ పూజ్యం–7, అవమానం–7

వృశ్చికం

వీరికి ఏల్నాటి శని దోషం ఉన్నా సెప్టెంబర్‌ వరకు గురు బలం కొంత ఉపకరిస్తుంది. ఆగస్టు నుంచి రాహువు కొంత యోగాన్నిస్తాడు. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది.  అదనపు ఆదాయం సమకూరుతుంది. అయితే లేనిపోని ఖర్చులు మీదపడతాయి. తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు  లాభించే అవకాశముంది. ఇంటిలో శుభకార్యాల రీత్యా ఖర్చులు తప్పక పోవచ్చు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. మిత్రులు, సన్నిహితులతో కొన్ని సందర్భాలలో అకారణంగా వైరం. వాహనాలు, భూములు కొనుగోలుకు చేసే యత్నాలు కొంత మేరకు సఫలం. ఆపన్నులకు స్నేహ హస్తం అందిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.  సోదరుల ద్వారా సహాయం అందుతుంది. విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి.  నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం. శాస్త్రసాంకేతిక రంగాల వారు తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆగస్టు–సెప్టెంబర్‌ మధ్య పదోన్నతులు  దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. కొత్త సంస్థలకు అనుమతులు లభిస్తాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు దక్కవచ్చు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొత్త అవకాశాలు. విద్యార్థుల యత్నాలు ప్రారంభంలో ఫలిస్తాయి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. రెండవ పంట లాభిస్తుంది. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని జన్మరాశి సంచారంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానరీత్యా చికాకులు. స్వల్ప అనారోగ్యం. అనుకున్న కార్యాలలో ఆటంకాలు. చైత్రం, జ్యేష్ఠం, భాద్రపదం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, రుద్ర జపం, రుద్రాభిషేకాలు మంచిది.

అదృష్ట సంఖ్య–9, ఆది, మంగళ

గురువారాలు అనుకూలం.

ఆదాయం–5, వ్యయం–5,రాజ పూజ్యం–3, అవమానం–3

ధనుస్సు

శని, రాహు ప్రభావాలు వీరి పై అధికంగా ఉన్నా గురువు యోగదాయకుడైనందున లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఖర్చులు పెరిగినా అవసరాలు తీరతాయి. ఇతరుల నుంచి అపవాదులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కుటుంబంలో చికాకులు కాస్త తప్పక పోవచ్చు. చేపట్టిన కార్యాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. శని ప్రభావం వల్ల తరచూ బంధువర్గంతో విభేదాలు నెలకొంటాయి.  అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ముఖ్యమైన వ్యవహారాలలో నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఉదర, నేత్ర,నరాలకు సంబంధించిన రుగ్మతలు బాధిస్తాయి. కాంట్రాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది. అయితే గురుని శుభత్వం వల్ల అవరోధాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు సెప్టెంబర్‌నుంచి అనుకూలిస్తుంది.  వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా మంచి గుర్తింపు రాగలదు. అయితే సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు.  పారిశ్రామికవర్గాలకు  ప్రభుత్వపరంగా కొంతమేరకు సహాయం అందుతుంది. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు ద్వితీయార్థంలో దక్కుతాయి. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. వ్యవసాయదారులకు ద్వితీయార్థంలో అనుకూలస్థితి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శని, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, అమ్మవారికి కుంకుమార్చన మంచిది. శివ పంచాక్షరి పఠించండి.

అదృష్ట సంఖ్య–3, ఆది

బుధ, శుక్ర, శనివారాలు అనుకూలం.

ఆదాయం–8, వ్యయం–11,రాజపూజ్యం–6, అవమానం–3.

మకరం

వీరికి శని, రాహు దోషాలు ఉన్నా గురుని శుభకారకత్వం ఉపకరిస్తుంది. జూన్‌–అక్టోబర్‌మధ్య శని లాభ స్థానంలో సంచారం లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదల, నేర్పుతో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కొన్ని విజయాలు సాధిస్తారు. బంధువులు మీ పట్ల కొంత వ్యతిరేకత చూపవచ్చు. స్నేహితులు, శ్రేయోభిలాషులు సహాయసహకారాలు అందిస్తారు. ఆదాయం సమకూరినా అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. శుభకార్యాల రీత్యా ఖర్చులు తప్పవు. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు ప్రథమార్థంలో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన చికాకులు, ఆగస్టు వరకూ వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు సామాన్య లాభాలు దక్కించుకుంటారు. కొత్త పెట్టుబడులు ఆలస్యమవుతాయి.  ఉద్యోగస్తులు విధుల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరికి బదిలీలు ఉండవచ్చు.  పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకమే. రాజకీయవర్గాలు అనుకున్న పదవులు దక్కక కొంత అసంతృప్తి చెందుతారు. కళాకారుల యత్నాలు కొంతమేరకు సఫలమవుతాయి. విద్యార్థుల కృషి సఫలమవుతుంది. వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి. చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం.  

శని, రాహు, కేతువులకు పరిహారాలు గణపతికి అభిషేకాలు చేయించుకుంటే మంచిది. మిగతావి సామాన్యం.

అదృష్ట సంఖ్య–8

సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలం.

ఆదాయం–11 వ్యయం–5,రాజపూజ్యం–2, అవమానం–6

కుంభం

వీరికి సెప్టెంబర్‌12 వరకు అష్టమ గురు దోషం కొంత ఇబ్బందికరం. శని అనుకూలుడు. రాహు, కేతువులు సామాన్యమైన ఫలితాలు ఇస్తారు.  మొత్తం మీద అనుకూల ఫలితాలే అధికంగా ఉంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.  సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఊహించని రీతిలో ధన, ఆస్తి లాభాలు ఉండవచ్చు.  అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు.  తండ్రి తరఫు వారితోనూ, జీవిత భాగస్వామితోనూ విభేదాలు తొలగుతాయి. ఒక కోర్టు వ్యవహారం సెప్టెంబర్‌ తర్వాత కొలిక్కి వచ్చే అవకాశముంది. ఇక అష్టమ గురు దోషం కారణంగా సెప్టెంబర్‌ వరకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు సెప్టెంబర్‌ నుంచి అనుకూలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. అదనపు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. కళాకారుల కలలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. వైశాఖం, శ్రావణం, కార్తీకం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

గురు దోష నివారణకు పరిహారాలు, ఆంజనేయస్వామికి అర్చనలు చేయండి.. అదృష్ట సంఖ్య...8  మిగతావి సామాన్యం.

ఆదాయం–11, వ్యయం–5,రాజపూజ్యం–2, అవమానం–6


మీనం

ఈ రాశి వారికి సెప్టెంబర్‌ వరకు గురువు యోగకారకుడు, తదుపరి సంవత్సరమంతా అష్టమ రాశి సంచారం. శని, రాహువులు అంతగా అనుకూలం కాదు. మొత్తంమీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా శ్రమానంతరం పూర్తి కాగలదు.  ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.  రుణదాతల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. సెప్టెంబర్‌ నుంచి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఆహార విహారాదులలో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువు మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. అయితే మనోనిబ్బరంతో ముందుకు సాగి అధిగమిస్తారు. చిరకాల ప్రత్యర్థులు సహాయపడడం విశేషం.  శుభకార్యాల నిర్వహణ పై నిర్ణయాలు తీసుకుంటారు.  నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్రారంభంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా పై స్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి.  పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు. కళాకారులకు జయాపజయాలు సమానంగా ఉంటాయి. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. వ్యవసాయదారులు మొదటి పంటలో లాభాలు పొందుతారు. వైశాఖం, శ్రావణం, కార్తీకం, ఫాల్గుణ మాసం  అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు గురునికి పరిహారాలు, రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది.

అదృష్ట సంఖ్య–3,

ఆది, మంగళ, గురు వారాలు కలసి వస్తాయి.

ఆదాయం–8 వ్యయం–11,రాజ పూజ్యం–1, అవమానం–2

Also Read