తొలిఏకాదశి ప్రాముఖ్యత

23rd July 2018 12:26am

తొలిఏకాదశి  ప్రాముఖ్యత 

కర్మ భూమిగా ప్రసిద్ది పొందిన భారతదేశం లో, కర్మలు ఆచరించడానికి అనువైన పండుగలను తిథుల ప్రకారంగా కూడా నిర్ణయించారు. వీటి లో ముఖ్యమైనది ఏకాదశీ తిథి. ప్రతి నెలలో వచ్చే ఏకాదశులు రెండూ విశిష్ఠమైన పర్వదినాలే. ఆషాడ శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేక శయనైకాదశి అంటారు.  ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. వ్రత దీక్షా కాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాడ శుద్ద ఏకాదశే మొదటిది కావడం చేత, ఇప్పటి నుంచి ఒకదాని తరవాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక పండుగను తొలి ఏకాదశి గా వ్యవహరిస్తారు. నేటి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషపాన్పు పై శయనించి, కార్తిక శుద్ద ఏకాదశినాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీన్ని శయనైకాదశి అని కూడా అంటారు

ఏకాదశి వ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌరది మతస్థులందరూ విష్ణు ప్రీతి కోసం ఆచరిస్తారు. వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచే సాధనలో కొనసాగుతారు. దశమి నాడు ఒక్కపూటే భుజించి, నియమాలను పాటిస్తూ మనస్సును సదా దైవ స్మరణలోనే ఉంచాలి. తద్వారా ఏకాదశి నాడు చేసే వ్రతాచరణకు దేహేంద్రియ మనో బుద్దులు చక్కగా సహకరిస్తాయంటారు

 

ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం. తులసి తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు. వ్రత దీక్షాపరులు దైవ చింతనలోనే కొనసాగాలి. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించరాదు. ద్వాదశి నాడు ఉదయమే నిత్య పూజలు చేసి శ్రీ మహా విష్ణువు ని , అజ్ఞానమనే అంధకారం చేత అంధుడనైన నాకు వ్రత ఫలం గా జ్ఞాన దృష్టిని అనుగ్రహించు అనే ప్రార్ధనా పూర్వకమైన మంత్రాన్ని పఠించాలని ధర్మసింధు చెబుతోందిఇలా నియమాలను పాటిస్తూ, ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహం తో, శ్రద్దా భక్తులతో ఆచరించే ఏకాదశీ వ్రతంవల్ల విష్ణు సాయుజ్యం, ఇహ లోకం లో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మసింధు తెలయజేబుతుంది.

  రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు:

బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి.

దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి.

మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి విధంగా సంకల్పం చెప్పుకోవాలి.

 

అయ్యా! రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి.

సాయంత్రం దీపారాధన చేసి రాత్రంతా కీర్తనలు చేసి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు ప్రసాదం స్వీకరించాలి.

 

భగవంతుడు యోగనిద్రలో ఉంటారు కదా, మనము చేసే పూజలు ఎవరికి చేరతాయి అనే అనుమానం మీరు పెట్టుకోనక్కరలేదు.

పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు అందులో

మొదటిది వైకుంఠంలో ఉండే శ్రీమహవిష్ణువుది పర అంటారు. స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించేది.

రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.

మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.

నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.

ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు

మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి  తెలిసి తెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.

 

Also Read