చంద్ర గ్రహణం

26th July 2018 4:19am

జ్యోతిషంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది . కారణం మానవుని పై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉండటం జీవితంలో కనబడుతుంది . చంద్రుడు భూమికి తక్కిన గ్రహాల కన్నా చాలా దగ్గరగా ఉండటం వల్ల భూమి పై అతని గురుత్వాకర్షణ ప్రభావం అత్యధికంగా పడుతుంది . అందుచేతనే పూర్ణిమ నాడు సముద్రంలో అధికంగా ఆటు పోట్లు ఉంటాయి . గ్రహణం నాడు ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది . గ్రహణంలో చంద్రుడు - సూర్యుని మధ్య భూమి రావటం జరుగుతుంది . అలంటి స్దితిలో చంద్రుడు భూమి నీడలో నుండి  ప్రయాణిస్తూ సాగుతాడు . ఇది కేవలం పౌర్ణమి నాడే సంభవిస్తుంది . పాక్షిక గ్రహణం -ప్రకాశమార్గం పూర్తిగా అడ్డగింపబడకుండా కొంత మేరకే అడ్డగించ బడుతుంటే పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది . చంద్ర గ్రహణం పౌర్ణమినాడే సంభవిస్తుంది . చంద్రగ్రహణం గరిష్ట అవధి 3 గంటల 40 నిమిషాలు వరకే ఉంటుంది .

చంద్ర గ్రహణం సంభవించే సమయానికి ముందు మూడు జాముల నుండి , భోజనం మానాలి . వృద్దులు , బాలురు , రోగులకు నియమం వర్తించదు . గ్రహణ సమయంలో ఆరాధ్యదైవానికి సంభవించిన జపాదులు చేయటం అనంత రెట్లు అధికఫలం కలిగిస్తుంది . గ్రహణ మోక్షకాలం తరవాత పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల అక్షయ పుణ్య ఫలం లభిస్తుంది . శాస్త్రనుసారం గ్రహణ సమయంలో ఇచ్చిన దానం , చేసే జపం , తీర్ధస్నానం అనేకరెట్లు అధికఫలం కలిగిస్తాయి . చంద్ర గ్రహణం సోమవారం కాని అయితే ఆనాడు చేసే దానాలు అంతకన్నా కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయి.

గ్రహణం సంభవించే అంశకు దగ్గరగా జాతకంలో గ్రహం ఏదైనా ఉంటే అతనిపై గ్రహణం దుష్ప్రభావం పడుతుంది . గ్రహం భావానికి కారణమైతే భావం యొక్క ఫలంపై ప్రభావం ఉంటుందిజాతకంలోని భావం యొక్క అంశ లో గ్రహణం సంభవించినా భావఫలం ప్రభావితమౌతుంది.

 గ్రహణ సమయం పర్వ కాలమని పురాణాలు , ధర్మ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది . చంద్ర లేక సూర్య గ్రహణం దర్శన యోగ్యం గా ఉంటే అదంతా పుణ్య కాలమే. ఇది స్పష్టం గా కనిపించక పోయినప్పటికీ, పంచాంగం ద్వారా లేదా శాస్త్రాల ద్వారా తెలుసుకొని గ్రహణ స్పర్శ మోక్ష కాలాలు తెలుసుకుని స్నానం చేయాలి. గ్రహణ స్నానాన్ని కట్టుకున్న వస్త్రాల తోనే చేయాలి.

గ్రహణ కాలం లో చేసే జపం, దానం, హోమం, మొదలయినవన్నీ అధిక ఫలితాలనిస్తాయి, కావున వీలైనంత వరకు ఆయా పుణ్య కార్యాలను  యథాశక్తి గా ఆచరించాలి.

గ్రహణం విడువగానే పుణ్య నదులు, సరోవరాలు, కాలువలు, బావులు, లేదా కనీసం ఇంట్లోనైనా స్నానం చేయడం వల్ల శారీరిక మానసిక మలినాలు తొలగి పోయి మంచి భావనలు కలుగుతాయి.

గ్రహణాన్ని నేరుగా ఎవరు కూడా నేరుగా కంటి తో చూడకూడదు. ఇంట్లో నిల్వ ఉంచి ఉపయోగించే ఆహార పదార్దాల పైన దర్భలు ఉంచాలి. అప్పుడు అవి పరిశుద్ద మవుతాయి.

ముఖ్యం గా గర్భిణి స్త్రీలు గ్రహణ కాలం లో బయటకు రాకూడదు, గ్రహణ సమయం లో వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం వల్ల గర్భస్త శిశువు మానసిక శారీరిక వైకల్యాలతో జన్మించే ప్రమాదం ఉంది. గ్రహణ సమయం లో ఇష్ట దైవానికి  సంబంధించిన స్తోత్రాలను లేదా నామ జపాన్ని చేయడం విశేష ఫలదాయకం. మిగిలిన వారు కూడా గ్రహణ సమయం లో వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు

 

 

Also Read