హయగ్రీవ జయంతి విశిష్టత

25th August 2018 10:14am

హయగ్రీవ జయంతి విశిష్టత

శ్రావణ శుక్ల పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి ని కూడా జరుపుకొంటాం. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా గుఱ్ఱపు తల కలిగిన మానవాకారంగా రూపొందిన పుణ్య దినం. హయ అంటే అశ్వం, గ్రీవ అంటే మెడ అని అర్ధం వస్తుంది. హయగ్రీవుడు చంద్ర మండల నివాసి, మహానందస్వరూపుడు. ఆయన నాసికం నుండి వేదాలు ఆవిర్భవించాయని పురాణ గాథ.

హయగ్రీవుడు తెల్లని శరీరం తో లక్ష్మీదేవి ని ఎడమ తొడ పై కూర్చుండబెట్టుకొని తెల్లని పద్మం మీద కూర్చుని ఉంటాడు. అతడి పై కుడి చేతి లో చక్రం, పై ఎడమ చేతి లో శంఖం, కింది ఎడమ చేతి లో పుస్తకం ఉంటాయి. కుడి చేయి చిన్ముద్ర కలిగి ఉంటుంది. వీటి లోని చిన్ముద్ర సమస్త జ్ఞానానికీ, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్ సృష్టి కి కారణభూతమైన నాదానికీ, చక్రం అజ్ఞాన సంహారానికీ చిహ్నాలు.

ఈ స్వరూపాన్ని ఉపాసించిన వారికి అన్ని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హయగ్రీవ నామాన్ని ఎవరైతే జపిస్తుంటారో వారికి గంగానదీ ప్రవాహం తో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం కూడా ఉంది.

ముఖ్యం గా విద్యార్థులు, ఇతర వృత్తులలో ఉన్నవారు , చక్కటి ఆలోచనలు, జ్ఞానం, బుద్ది మరియు ఆధ్యాత్మిక సంపద పొందడానికి ఈ రోజు హయగ్రీవుని తులసి దళాలతో విశేషం గా పూజించడం వలన సకల శుభ ఫలితాలు పొందగలుగుతారు. గర్భవతులు ఈ రోజు హయగ్రీవుని పూజిస్తే చక్కటి బుద్ది, ఆరోగ్యం, తేజస్సు కలిగిన సంతానాన్ని పొందగలుగుతారు.

Also Read