సంక్రాంతి అంటే ఏమిటి

14th January 2019 12:57am

సంక్రాంతి విశిష్టత:

సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. దేవమార్గం ప్రారంభమయ్యే రోజు. ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలనిస్తాయి. సంక్రాంతి రోజు గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజున మిక్కిలి శుభఫలాలనిస్తుంది. దేవ పితృ దేవతలనుద్దేసించి  చేసే తర్పణాలు, దానాలు పుణ్యప్రదం. పౌష్య లక్ష్మిగా అమ్మవారి ని ఆరాధించే సమయం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏ ఏ దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి అత్యధికం గా లభిస్తాయని ప్రతీతి. అందుకే ఈ రోజు ఎవరి ఇంట్లోను లేదు అనే మాట రాకూడదని పెద్దలు చెబుతారు. అలాగే సంక్రమణ కాలం లో ధాన్యం, గోవులు, కంచు వస్తువులు, బంగారం దానం చేయటం ఉత్తమమైనవి గా చెప్పబడ్డాయి. వీటిని దానం చేసేంత శక్తి లేని వారు నువ్వులు లేదా నెయ్యి లేదా వస్త్రాలను దానం చేయవచ్చు. ఫలాలు, కర్రలు చెరుకు, మీగడ తో కూడిన మజ్జిగ దానం కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది. పెళ్ళి అయిన వారు తమ తమ పసుపు కుంకుమలు కలకాలం నిలవడం కోసం మంగళకరమైన వస్తువులను వారి వారి శక్తి ని అనుసరించి తాంబూలాలు/వాయినాలు ఇస్తారు. 

ఈ పుణ్య కాలం లో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం,ఆవు నేతి తో అభిషేకం చేయడం,  నువ్వుల నూనె తో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యం గా ఆచరించవలసిన విధి. ‘సంక్రమణం’ నాడు ఒంటి పూజ భోజనం చేయాలి. దేవతలకు పితృదేవతల పూజలకు పుణ్యకాలం. మంత్ర జపాదులకు, ధ్యానం, పారాయణ శ్రేష్ఠ ఫలాలని శీఘ్రంగా ప్రసాదించే కాల మహిమ సంక్రమణానికి ఉంది.

Also Read