శ్రీ వికారినామ సంవత్సర ఫలితాలు

6th April 2019 12:41am

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ వికారినామ సంవత్సరంగా పిలుస్తారు. బార్హస్పత్యమానం ప్రకారం  విరోధికృన్నామ సంవత్సరమని, గురుదయాబ్ధముచే ఆషాఢాబ్దమని పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 33వది వికారినామ సంవత్సరం. అధిపతి చంద్రుడు.

ఈ ఏడాది వస్త్రదానం శుభదాయకం. చంద్రుని ఆరాధించిన బుద్ధి కుశలత, మనశ్శాంతి చేకూరుతుంది. 

 

శ్రీ వికారినామ సంవత్సర ఫలితాలు (6-04-2019 – 24-03-2020)

 

ఈ సంవత్సరం రాజు శని, మంత్రి రవి, సైన్యాధిపతి శని, సస్యాధిపతి బుధుడు,  ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, . రవి రాత్రి యందు ఆరుద్రా నక్షత్ర ప్రవేశం దుఖఃదాయకం, అలాగే సాయంత్రం పూట రవి మేషరాశి ప్రవేశం తృణ, సస్యనాశనం. పశుపాలకుడు, పశుసంరక్షకుడు కూడా బలరాముడే కావడం వల్ల పశుసంపద, పాడి పరిశ్రమకు లాభదాయకం. నల్లటి, ఎరుపు భూములు బాగుగా పండుతాయి. వర్షాలు సాధారణంగా ఉంటాయి. అయితే ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో వర్ష ప్రభావం అధికం.

ఈ ఏడాది నవనాయకుల్లో అయిదుగురు శుభులు, మిగతా వారు పాపులు. ఉపనాయకుల్లో 10మంది శుభులు, 11మంది పాపులు. రవి మృగశిర నక్షత్రంలో ప్రవేశంతో జూన్‌8న తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి.

ఈ ఏడాది వర్ష లగ్నం కర్కాటకం, జగల్లగ్నం కన్య. వీటి రీత్యా చూస్తే... ప్రజలు అనారోగ్యాలు, ఒడిదుడుకుల మధ్య జీవనం సాగిస్తారు. 

ప్రభుత్వాలకు వివిధ రూపాలలో  ఆదాయం బాగా పెరుగుతుంది. పాలకులు ప్రజాభీష్టానికి అనుకూలంగా పాలన సాగిస్తారు. ఆహారధాన్యాల నిల్వలు పెరుగుతాయి. మారెట్లు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతాయి. వాహనాల ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు. కోర్టు కేసులు పెరుగుతాయి.

 

అయితే ప్రభుత్వానికి సంబంధించి కమ్యూనికేషన్, రైల్వే, పర్యాటక శాఖ, టీవీ రంగాలు మరింత అభివృద్ధిపథంలో సాగుతాయి. పరిశోధనల్లో ప్రగతి ఉంటుంది.  శని రాజు, మంత్రి రవి కావడం వీరిద్దరూ శత్రువులు  కావడం వల్ల పరిపాలనలో తరచూ ఒడిదుడుకులు, వివాదాలు, ఉన్నత స్థితిలోని వారిపై ఆరోపణలు తద్వారా రాజీనామాలకు దారితీయవచ్చు. కొన్ని కుంభకోణాలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేయవచ్చు. ప్రభుత్వనేతల మధ్య అపార్ధాలు, పరస్పర నిందలు పాలకపక్షాలకు సవాలుగా మారవచ్చు. ఇరుగుపొరుగు దేశాలతో యుద్ధ భయాలు, సైనికపరంగా ఖర్చులు పెరుగుతాయి.

 

వర్షపాతం సాధారణంగానే ఉంటుంది. అయితే తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో అతివృష్టి, మిగతా ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఉండవచ్చు. ధాన్యం, బంగారం, చమురు, పత్తి ధరలు పెరుగుతాయి. వెండి, నూనెల ధరలు తగ్గుతాయి. నల్లరేగడి భూములు బాగా పండుతాయి. అలాగే, నల్లటి ధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది. రోడ్డు, రైల్వే, విమాన ప్రమాదాలు, వింతవ్యాధులు ప్రజలను ఆందోళన పరుస్తాయి.

 

ప్రభుత్వాలు కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటాయి. అనూహ్యమైన నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్య నేతల ఆరోగ్యాలు గందరగోళంగా కొంత గందరగోళంగా ఉంటాయి. కొన్ని  ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్ధకంగా ఉండవచ్చు.

 

అపరాలు బాగా పండుతాయి. ధాన్యం పంట బాగుగా పండి ధరలు గిట్టుబాటు కాగలవు.  ప్రకృతి బీభత్సాలు, ఆర్థిక సంక్షోభం వంటి ఫలితాలు ఉంటాయి. వజ్రాలు, తెలుపు వస్తువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుంది.   కళాకారులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వైద్యులకు ఈ సంవత్సరం బాగా కలిసివస్తుంది. క్రీడాకారులకు కొంత నిరాశాజనకం.  రియల్‌ఎస్టేట్, సాప్ట్‌వేర్‌రంగాల వారు పూర్వవైభవం పొందుతారు.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యవసాయరంగానికి కొత్త ఊపు, ప్రోత్సాహం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాఫీగా సాగుతుంది. అయితే మధ్యలో ప్రతిపక్షాల నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చు. చమురు, వాహనాలు, మొబైల్‌ఫోన్లు ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

ఈ ఏడాది జూలై 23 నుంచి చతుర్‌గ్రహకూటమి, 2020 జనవరి 14 వరకు పంచ గ్రహ కూటమి కారణంగా  జల ప్రమాదాలు, జల భయాలు, యుద్ధ భయాలు, ప్రాణ నష్టం, ప్రజలకు రోగాల భయాలు ఉంటాయి. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం గడుస్తుంది.

 

నవనాయకుల ఫలాలు.

రాజు–శని కావడం వల్ల స్వల్ప వర్షాలు, యుద్ధభయాలు, వివిధ ప్రమాదాలు, ఆకలి బాధలతో ప్రజల అవస్థలు. మసాలా, కారాలు, రసాయనాలు, నువ్వులు, ఇనుము వేరుసెనగ వంటి ధరలు పెరుగుతాయి. రాజకీయ ఒడిదుడుకులు.

 

మంత్రి–రవి కావడం వల్ల పాలకుల మధ్య పరస్పర వైరం, యుద్ధాలు, అనావృష్టి పరిస్థితులు. ధాన్యం, రస వస్తువులు, విద్యుత్, నూనె గింజల ధరలు పెరుగుదల.

 

 

సైన్యాధిపతి -శని అగుట వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములోని అధికార వర్గములోని వారికి అభిప్రాయ భేదములు, మనస్పర్థలు ఎక్కవగును. ప్రజలలోను అధికారులలోను న్యాయన్యాయ విచక్షణ తగ్గుతుంది. ఆహార పదార్థాల ధరలు పెరుగును. ఇనుము, లోహము, తిలతైలములు, బంగారు, బొగ్గు చర్మ సంబంధమైన వస్తువులు, ఎరువుల ధరలు పెరుగును. అధర్మానికి ప్రోత్సాహం ఎక్కువ గా ఉండును. సరిహద్దు తగాదాలు, హింసాకాండ ఎక్కువగును.

 

సస్యాధిపతి–బుధుడు కావడం వల్ల పంటలకు చీడపీడలు, ఈతి బాధలు. నెయ్యి, పత్తి, పెసలు వంటి ధరలు పెరుగుతాయి. అలాగే, బంగారం ధరలు కొంత పెరిగి స్థిరత్వం పొందుతాయి.

 

 

ధాన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పాలు, వెండి, పంచదార, బియ్యం ధరలు తగ్గుతాయి. ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి. పాలకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

 

అర్ఘాధిపతి -శని  కావడం వల్ల నల్ల ధాన్యములు, మినుములు, నువ్వులు, అవిసెలు, నల్ల ఆవాలు, ఉలవలు నల్లని భూములు బాగా పండుతాయి. స్టీలు, ఇనుము, బొగ్గు, చర్మముతో చేసిన వస్తువులు మొదలైన వాటికి ధరలు పెరుగుతాయి. సైనిక, యంత్ర, ఆయుధ, వాహనములకు ఊహించని సంఘటనలు జరుగును. వర్షాలు సామాన్యం గా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, కొత్తకొత్త వ్యాధులు, దొంగతనాలు, హింసాకాండలు ఎక్కువవుతాయి.

 

రసాధిపతి –శుక్రుడు కావడం వల్ల   సుగంధ ద్రవ్యాల ధరలు నిలకడగా ఉండి అందుబాటులో ఉంటాయి. వీటి ఉత్పత్తులు పెరుగుతాయి. నెయ్యి, నూనెలు , బెల్లం, తేనె  మొదలగు రస ద్రవ్యాల  ధరలు తగ్గును. వ్యవసాయానికి ఎరువులు అందుబాటు లో ఉండును .ఆయుర్వేద వైద్యానికి మంచి రోజులు.

 

నీరసాధిపతి –బుధుడు కావడం వల్ల అపరాలు, గోధుమలు, వస్త్రాల ధరలు కొంత పెరిగి స్థిరంగా కొనసాగుతాయి. ధాన్యములు బాగుగా పండును, వీటి వాడకం కూడా పెరుగును. ప్రజలకు నూతన అనారోగ్య  సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉండును.

 

కర్తరి

04.05.2019 చైత్ర బ.అమావాస్య శనివారం  సా.5.34గంటలకు డొల్లు కర్తరి (చిన్న కర్తరి) ప్రారంభం.

11.05.2019         వైశాఖ శు.సప్తమి శనివారం రా.3.27 గంటలకు నిజ కర్తరి ప్రారంభం.

29.05.2019 వైశాఖ బ.దశమీ బుధవారం ప.12.29 గంటలకు కర్తరి త్యాగం. (పరిసమాప్తం)

 

మూఢములు

గురు మూఢమి

13.12.2019 శుక్రవారం, మార్గశిర శు.విదియ రా.1.11గంటలకు పశ్చాదస్తమిత గురు మూఢమి ప్రారంభం

10.01.2020 గురువారం, పుష్య శు.పౌర్ణమి రా.10.23 గంటలకు మూఢమి త్యాగం.

శుక్ర మూఢమి

08.07.2019 సోమవారం, ఆషాఢ శు.సప్తమి రా.2.38 గంటలకు శుక్రమూఢమి ప్రారంభం.

20.09.2019 శుక్రవారం, భాద్రపద శు.షష్ఠి ఉ.6.07 గంటలకు శుక్రమూఢమి త్యాగం.

మకర సంక్రమణం

శ్రీ వికారినామ సంవత్సరం పుష్య బహుళ పంచమి బుధవారం అనగా 15.01.2020వ తేదీ ఉదయం 7.36 గంటలకు రవి మకరరాశి ప్రవేశం. ఉదయాది రెండవ ముహూర్త కాలంలో రవి మకర రాశి ప్రవేశం శుభదాయకం.

 

పుష్కర నిర్ణయం

శ్రీ వికారినామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమీ సోమవారం అనగా 04.11.2019 వ తేదీ తె.5.18గంటలకు (తెల్లవారితే మంగళవారం) గురువు  ధనుస్సు రాశిలో ప్రవేశం. అనగా 05.11.2019 వ తేదీ నుంచి 12రోజుల పాటు బ్రహ్మపుత్రానదీ (పుష్కరవాహిణి) జరుగుతాయి. టిబెట్‌లోని ఉత్తర హిమాలయాల ప్రాంతంలో పుట్టిన ఈ నది భారతదేశం, బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహిస్తుంది. ఇది ఈశాన్య రాష్ట్రాలలోని అరుణాచలప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో ప్రవహిస్తుంది.

 

గ్రహణాలు

చంద్ర గ్రహణం –ఆషాఢ శు.పౌర్ణమి మంగళవారం అనగా 16.07.2019వ తేదీ రాత్రి 1.31గంటలకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం. వాయువ్యదిశలో స్పర్శ, ఆగ్నేయ దిశలో మోక్షం. ఉత్తరాషాఢ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుంది. ధనుస్సు, మకర రాశుల వారు చూడరాదు. రాత్రి 1.31గంటలకు ప్రారంభమై 4.29గంటలకు మోక్షకాలం ఉంటుంది.

 

పాక్షిక సూర్యగ్రహణం

మార్గశిర బ.అమావాస్య గురువారం అనగా 26.12.2019వ తేదీ ఉదయం .8.11  గంటలకు పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఉత్తర ఈశాన్య స్పర్శ, రుతిలో మోక్షం. మూలా నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుంది. ధనుస్సు రాశి వారు దీనిని చూడరాదు. ఈ రాశి వారు యథావిధిగా మరుసటి రోజు పరిహారాలు చేసుకోవాలి. ఉదయం 8.11 గంటలకు ప్రారంభమై 11.20 గంటలకు మోక్షకాలం.

––––––––––––––––––––––––––––

 

 

 

Also Read