తొలిఏకాదశి ప్రాముఖ్యత

12th July 2019 12:38am

కర్మ భూమిగా ప్రసిద్ది పొందిన భారతదేశం లో, కర్మలు ఆచరించడానికి అనువైన పండుగలను తిథుల ప్రకారంగా కూడా నిర్ణయించారు. వీటి లో ముఖ్యమైనది ఏకాదశీ తిథి. ప్రతి నెలలో వచ్చే ఎకాదశులు రెండూ విశిష్ఠమైన పర్వదినాలే. ఆషాడ శుక్లపక్షం లో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేక శయనైకాదశి అంటారు.  ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. ఈ వ్రత దీక్షాకాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాడ శుద్ద ఏకాదశే మొదటిది కావడం చేత, ఇప్పటి నుంచి ఒకదాని తరవాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలిఏకాదశి గా వ్యవహరిస్తారు. నేటి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలసముద్రంలో శేషపాన్పు పై శయనించి, కార్తికశుద్ద ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీన్ని శయనైకాదశి అని కూడా అంటారు. 

ఏకాదశివ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌరది మతస్థులందరూ విష్ణుప్రీతి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచే సాధనలో కొనసాగుతారు. దశమినాడు ఒక్కపూటే భుజించి, నియమాలను పాటిస్తూ మనస్సును సదా దైవస్మరణలోనే ఉంచాలి. తద్వారా ఏకాదశినాడు చేసే వ్రతాచరణకు దేహేంద్రియ మనోబుద్దులు చక్కగా సహకరిస్తాయంటారు. 

 

ఏకాదశినాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం. తులసి తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు. వ్రతదీక్షాపరులు దైవ చింతనలోనే కొనసాగాలి. ద్వాదశినాడు అతిథిలేకుండా భుజించారాదు. ద్వాదశినాడు ఉదయమే నిత్య పూజలు చేసి కేశవా! అజ్ఞానమనే అంధకారం చేత అంధుడనైన నాకు వ్రత ఫలం గా జ్ఞాన దృష్టిని అనుగ్రహించు అనే ప్రార్ధనాపూర్వకమైన మంత్రాన్ని పఠించాలని ధర్మసింధు చెబుతోంది. ఇలా నియమాలను పాటిస్తూ, ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహం తో, శ్రద్దా భక్తులతో ఆచరించే ఏకాదశీ వ్రతం వల్ల విష్ణు సాయుజ్యం, ఇహ లోకం లో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మ సింధు తెలియచెబుతుంది.

 

Also Read