సోమవతి అమావాస్య విశిష్ఠత మరియు పాటించవలసిన పరిహారాలు
అమావాస్య తిథి సోమవారం ఉన్నప్పుడు సోమవతి అమావాస్య అంటారు. జ్యోతిష్యపరం గా చంద్రునికి ప్రముఖ స్థానం కలిగి ఉండడం, చంద్రుడు మనః కారకుడు కావడం విశేషం గా చెప్పబడింది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క ప్రభావం మనసు పై, ఆలోచనల పై స్పష్టం గా ఉంటుంది. జాతకరీత్యా చంద్రుని స్థితి బాగోలేక పోతే మానసిక సమస్యలు, అస్థిరమైన ఆలోచనలు, ప్రతి చిన్న విషయానికి నిరాశ పడిపోవడం ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అంతే కాకుండా ఒకే సమయం లో ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు, సోమవతి అమావాస్య రోజున వారి శక్తి కొద్దీ పరిహారాలు పాటించి మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రోజు చంద్రునికి చేసే పూజలు దానాల వలన చెడు ఫలితాలు నశించి , నూతనోత్సాహం శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది.
ఈ రోజున శివుడికి పాలు మరియు గంధం తో అభిషేకం చేసి పూజించడం, నదీ స్నానం ఆచరించడం , తులసి పూజ, ముఖ్యం గా తులసి కోటకి ప్రదక్షిణలు చేయడం, సూర్యాష్టకం పఠించి సూర్యుని కి అర్ఘ్యం ఇవ్వడం మంచి ఫలితాలనిస్తుంది.
ఈ రోజున చక్కెర, బియ్యం, పాలు, నెయ్యి, పెరుగు వంటి పదార్థాలను దానం చేయడం వలన గ్రహ సంబంధిత సమస్యలు తొలగుతాయి.
ముఖ్యం గా బ్రాహ్మణులకి భోజనం పెట్టడం పుణ్యప్రదం గా చెప్పబడింది.