మార్గశిర మాసం విశిష్ఠత

మార్గశిర మాసం విశిష్ఠత

 

మార్గశిర మాసం విశిష్ఠత

హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయం గా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు.

చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి.  శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం, తులసీ దళముతో పూజించడం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది. బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని ముద్దగా చేసి  శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ   శరీరానికి పూసుకుని స్నానమాచరించడం వలన ఆరురోగ్యం ప్రాప్తిస్తుంది.

 

ఈ మాసం లో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఆరోగ్య ప్రదం, సంధ్యావందన, జపం ధ్యానం, దైవారాధనలు నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, శ్రీలక్ష్మి సమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.

 

సూర్యుడు 12 రాశుల్లో ఒక రాశి నుండి మరొక రాశి  లోకి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.

మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.

మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.

మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.

మార్గశిర అష్టమి ని కాళభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి  శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.  ఈరోజు గంగా స్నానం, పితృ  తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు.

ఈ మాసం లో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు కి పఞ్ఞాచామృతాభిషేకం ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.

మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.

కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download