గురు పూర్ణిమ విశిష్ఠత

గురు పూర్ణిమ విశిష్ఠత

గురు పూర్ణిమ విశిష్ఠత

వ్యాసుడు పుట్టిన పుణ్యతిథి ఆషాడ శుద్ద పౌర్ణమి. ఈ పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని   పూజిస్తే, ద్యానించిన వారికి తన స్వరూప దర్శనం కలుగుతుందని వ్యాసుడే చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. అందుకే యావద్భారతదేశం పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భం గా వ్యాసమహర్షిని పూజించి తరిస్తోంది.  

సత్యవతీ-పరాశరుల  పంటగా, నది మధ్య ఉన్న దీవిలో నల్లటి రంగుతో జన్మించి క్రిష్ణ ద్వైపాయనుడుగా పేరు గడించాడు , పుడుతూనే వేదాలను వల్లించి, ఆ తరువాత వేదరాశిని సంస్కరించి, విభజించి, భోధించి, వ్యాప్తి చేసి వేదాంగ భాస్కరుడుగా కీర్తి పొందాడు, పురానేతిహాసాల్లో సులభతరం చేసి వేదసారాన్ని జొప్పించి పంచమ వేదమైన మహాభారతాన్ని, భక్తిరసప్రధానమైన భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలనూ రచించి, అమూల్యమైన ఆర్ష సాహిత్యాన్ని లోకానికి అనుగ్రహించిన జ్ఞానమయ ప్రదీపుడుగా విశ్వవిఖ్యాతి చెందాడు, సనక సనందాదుల చెంత బ్రహ్మవిద్యను అభ్యసించి, న్యాయ ప్రస్థానమైన బ్రహ్మ సూత్రాలను రచించించి, బదరికావనం లో తపస్సు చేసినందు చేత బాదరాయణుడు అనిపించుకొని జగద్గురువైన శ్రీకృష్ణ స్వరూపిడిగా ప్రకటితమయ్యాడు  వ్యాస భగవానుడు.

గురువు తన జ్ఞాన భోధద్వారా శిష్యుడిలోని అజ్ఞానాన్ని పోగొట్టి, పూర్ణ స్వరూపుడిగా తీర్చిదిద్దే త్రిమూర్తి స్వరూపుడు. అజ్ఞానం నుంచి మేల్కొలిపే దేవుడే గురు దేవుడు. పాంచ భౌతికమైన శరీరం లో తెలియవచ్చే భగవానుడే గురుదేవుడు. ఇటువంటి గురుశిష్య సంప్రదాయాన్ని ఏర్పరిచిన గురువులకు గురువే వ్యాస భగవానుడు. ఈయన వల్లనే ఆధ్యాత్మిక గురువుకు ఆర్ష సంస్కృతి లో ఎనలేని గౌరవస్థానం దక్కింది. అందుకే గురు పరంపరలో నిలిచినా గురు మహాత్ములందరినీ జ్ఞాన ప్రదాతలుగా సంస్మరించుకొని , తమతమ గురువుల్లో వ్యాసాదులను దర్శించి, ఏటేటా వారిని కృతజ్ఞతతో ప్రత్యేకంగా పూజించే పండుగే గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ. 

'గు'అంటే అంధకారం, 'రు' అంటే పారద్రోలటం అని అర్ధం. అజ్ఞాన అంధకారాన్ని  పారద్రోలి జ్ఞాన తేజస్సును ప్రసాదించేవాడు గురువు. భారతీయ సంస్కృతి లో గురువు యొక్క స్థానం  ఉన్నతమైనది. అజ్ఞానం వల్ల కలిగే అన్ని దుఃఖాలను పోగొట్టే వాడే సద్గురువు. గురువు యొక్క అనుగ్రహం సిద్దించిన వారికి అసాధ్యమైనది ఈ ప్రపంచం లో ఉండదు. ఆధ్యాత్మిక జీవన రహస్యాలని, భగవంతుని ఉనికిని అర్ధం చేసుకోవాలని కోరుకొనే వారికి గురువు అవసరం ఉంటుంది. శరణాగతి లేకుండా  దేనినీ నేర్చుకోలేరు. గురువు పట్ల భగవంతుని పట్ల చూపే భక్తిప్రపత్తులనే చూపించాలి.  గురువు అనుగ్రహం ఉంటే భగవంతుని అనుగ్రహం లభించినట్టే. గురువు ను శరణు వెడితే,  ఆ శరణాగతిని భగవంతుడు తనకు చేసినది గా స్వీకరిస్తాడు. గురువు కావాలనే తపన కలిగితే దైవమే మనుష్యరూపంలో గురువై సాక్షాత్కరించి మంత్రం ఉపదేశిస్తాడు. ప్రత్యక్ష గురువు ఉపదేశం ఉత్తమమైంది.

సాక్షాత్తు భగవదవతరులైన శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు కూడా గురూపదేశం పొంది సేవించినవారే. గురువు ఉపదేశించిన మంత్రం వదలక జపించి స్మరించే వారికి గురుకృప తప్పక లభిస్తుంది. ప్రతి గురు పూర్ణిమకు సద్గురువు దర్శనం,స్మరణం శుభం కలిగిస్తాయి . గురుపూర్ణిమ సద్గురువుల సేవకు ఉత్తమమైన రోజు. వారి ద్వారా మంత్రోపదేశం పొందడానికి శుభ దినం

 

 

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download