ఉగాది కృత్యం

ఉగాది కృత్యం

ఉగాది కృత్యం....

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగువారి ఆనవాయితీ.

తెలుగువారు చాంద్రమానం, తమిళులు సౌరమానం ఆధారంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఉదయమే అభ్యంగన స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన (తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు) ఉగాది పచ్చడిని తినడంతో పండుగ ప్రారంభమవుతుంది.

అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం,

కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

పంచాంగ సారాంశం.

–––––––––––––––––

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినదే పంచాంగం.

తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వుద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు  కార్యసిద్ధికి తోడ్పడతాయి.

ఈ పంచాంగ శ్రవణం వింటే సర్వ శుభాలు కలుగుతాయి.

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ క్రోధినామ  సంవత్సరంగా పిలుస్తారు.

ప్రభవాది 60 సంవత్సరాల్లో 38వది. క్రోధము, ఇతరులకు అసహనం, కోపతాపాలు పెంచేది క్రోధినామ సంవత్సరం.

ఈ సంవత్సరం అధిపతి శని, ఈ గ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.  అలాగే, తిల దానం మంచిది.

కర్తరులు..

మే 4వ తేదీ చైత్ర బహుళ ఏకాదశి, శనివారం ప.12.34 గంటలకు డొల్లు కర్తరి (డొల్లు) ప్రారంభం.

మే 11 అనగా వైశాఖ శుద్ధ చవితి, శనివారం ఉ. 10.22 గంటలకు నిజ కర్తరి(అగ్నికర్తరి) ప్రారంభం.

మే 28 అనగా వైశాఖ బహుళ షష్ఠి మంగళవారం రా. 7.22 గంటలకు కర్తరి త్యాగమవుతుంది. ఈ కాలంలో శంకుస్థాపనలు, ఇంటి నిర్మాణాలు చేయరాదు.

మూఢములు

–––––––––––––––––––

శుక్ర మూఢమి...01.05.24వ తేదీ చైత్ర బహుళ నవమి బుధవారం రా.3.34 గంటలకు ప్రాగస్తమిత శుక్రమూఢమి ప్రారంభం.

07.07.24వ తేదీ ఆషాఢ శుద్ధ విదియ ఆదివారం సా.5.17 గంటలకు శుక్రమూఢమి సమాప్తం.

తిరిగి 18.03.25వ తేదీ ఫాల్గుణ బహుళ చవితి మంగళవారం ఉ.7.13 గంటలకు పశ్చాదస్తమిత శుక్రమూఢమి ప్రారంభం.

28.03.25వ తేదీ ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం ఉ.6.32 గంటలకు శుక్రమూఢమి సమాప్తం.

గురుమూఢమి....05.05.24వ తేదీ చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉ.7.38 గంటలకు పశ్చాదస్తమిత గురుమూఢమి ప్రారంభం.

01.06.24వ తేదీ జ్యేష్ఠ బహుళ దశమి శనివారం, రా.7.11 గంటలకు గురుమూఢమి ఆఖరు.

ఈ ఏడాది వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అంటే మే1 నుండి జూలై 7వ తేదీ వరకూ గురు,శుక్రమూఢముల కారణంగా శుభముహూర్తాలు లేవు. ఆషాఢం శూన్యమాసం, ఇక  శ్రావణ మాసంలో యధాతథంగా ముహూర్తాలు ఉన్నాయి. 

మకర సంక్రమణం....

జనవరి 2025 , 14వ తేదీ మంగళవారం అనగా పుష్య బహుళ పాడ్యమి, ఉత్తరాషాఢ నక్షత్రం, విష్కంభం యోగం, బాలువ కరణంలో ప.2.44 గంటలకు రవి మకరరాశిలో ప్రవేశం.  మకర సంక్రాంతి అయిన ఈరోజున దానధర్మాల వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూరతాయి.

పుష్కరాలు

ఈ ఏడాది మే 1వ తేదీ చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1.01గంటలకు దేవగురుడు బృహస్పతి వృషభరాశిలో ప్రవేశం. ఈ రోజు నుండి నర్మదానదికి పుష్కరాలు ప్రారంభం. పుష్కరాలు జరిగే 12రోజులు దానధర్మాలు, నదీస్నానం మోక్షప్రదమైనవి.

–––––––––––––––––––––––––––

గ్రహణాలు..

 ఈ సంవత్సరం మన  దేశంలో గానీ, తెలుగు రాష్ట్రాలలో గానీ సూర్య, చంద్ర గ్రహణాలు లేవు.

శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు..

ఈ సంవత్సరం రాజు, అపరసస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు.

మంత్రి, సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని. పూర్వసస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు.  

నవ నాయకుల్లో ఇద్దరు శుభులు కాగా, ఏడుగురు పాపులు.

అలాగే, ఉపనాయకుల్లోని 21మందిలో ఆరుగురు శుభులు, 15మంది పాపులు.

రాజు కుజుడు, మంత్రి శని కావడం, వీరు లగ్నాత్తు తృతీయ స్థానం కుంభరాశిలో కలయిక వల్ల,  పరస్పరం శత్రువులు కావడం వల్ల పాలకుల మధ్య వైషమ్యాలు.

అవగాహనాలోపం, పాలనలో గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు.

అయితే, పైస్థాయి వారి మాటే శిరోధార్యం కాగలదు.

అలాగే, మంత్రుల మధ్య పరస్పర వివాదాలతో కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలకు గడ్డుస్థితి నెలకొనవచ్చు.

అయితే దేశఖ్యాతి పెరిగి కొన్ని దేశాలు స్నేహహస్తం కూడా అందిస్తాయి.

ఇదే సమయంలో కొన్ని దేశాలతో యుద్ధ వాతావరణం కూడా ఏర్పడవచ్చు.

కొన్ని సందర్భాలలో సైనిక చర్యలు అవసరం కావచ్చు.

ప్రభుత్వాలకు ఆదాయం విశేషంగా పెరిగి సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తుంది.

వ్యవసాయపరంగా కొన్ని సమస్యలు ఎదురైనా పంటల ఉత్పత్తికి లోటు రాదు. రైతులకు కొత్త పథకాలు అమలులోకి వచ్చి ప్రోత్సాహం అందుతుంది.

విద్య, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా విద్యారంగానికి  పెద్దపీట వేస్తారు.

శాస్త్రసాంకేతికపరంగా మనదేశం కొత్త పుంతలు తొక్కుతుంది. మరిన్ని సంస్థలు ఏర్పాటు చేస్తారు.

అగ్రదేశాలు సైతం మనవైపునకు ఆకర్షింపబడతాయి.

అద్భుతమైన గనులు లేదా నిధులు బయల్పడే అవకాశాలున్నాయి. 

బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయి.

వ్యవసాయ అనుబంధ రంగాలలో నూతన ఆవిష్కరణలు.

ప్రభుత్వాలు ప్రజానిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే ప్రజాగ్రహాం పెల్లుబికే అవకాశం ఉంది. 

కళారంగం వారికి గతంతో పోలిస్తే కొంత నయంగా కనిపిస్తుంది.

రాజకీయ నాయకులకు కొత్త భవిష్యత్తు ఆవిష్కృతమవుతుంది.

అయితే కొందరు నాయకులు, సినీ రంగంలోని పేరుగాంచిన కళాకారుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

అంతర్జాతీయ స్థాయి అవార్డు ఒకటి మనదేశానికి దక్కే వీలుంది.

అత్యున్నత స్థాయి పదవులకు మహిళలు  ఎంపిక కావచ్చు.

నిత్యావసర వస్తువుల ధరలు కొంతమేర అదుపులోకి వస్తాయి.

శని ఆధిపత్య ప్రభావం వల్ల బస్సు, రైళ్లు, విమాన ప్రమాదాలు.

కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో  ప్రకృతి వైపరీత్యాల వల్ల జననష్టం జరిగే సూచనలు.

కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారవచ్చు. 

అక్టోబర్‌నుండి 2025 జనవరి 20 వరకు కర్కాటక రాశి అయిన నీచ స్థానంలో కుజుని స్తంభన కారణంగా భయోత్పాతాలు, భూకంపాది ప్రమాదాలు, రైలు, బస్సు ప్రమాదాలు, వ్యాధులు ప్రబలడం వంటి భయాలు కలుగుతాయి.

ఇక బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో తుఫాన్ల వల్ల నష్టాలు సంభవించవచ్చు. 

కుజుడు రాజు కావడం వల్ల భూముల రేట్లకు రెక్కలు వచ్చే అవకాశాలున్నాయి.

మొత్తం 20 భాగముల(రెండు తూములు) వర్షంలో 9 భాగాలు సముద్రంలోనూ, 9 భాగాలు పర్వత ప్రాంతంలోనూ, 2భాగాలు భూమిపైన కురుస్తాయి.

ఈ ఏడాది వర్ష లగ్నం ధనుస్సు అయినది. లగ్న చతుర్దాధిపతి     

గురువు మేషంలో, ద్వితీయ, తృతీయాధిపతి శని తృతీయమైన కుంభంలో పంచమ, వ్యయాధిపతి కుజునితో కలయిక, షష్ఠమ, లాభాధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితి అయిన మీనరాశిలో భాగ్యాధిపతి రవి, సప్తమ, దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు, రాహువులతో కలయిక.  దశమంలో కేతువు సంచారం.

ఇక జగర్లగ్నం పరిశీలించగా, ఇది కూడా ధనుస్సు లగ్నమే. లగ్న, చతుర్దాధిపతి గురువు  మేషంలో భాగ్యాధిపతి రవితో, ద్వితీయ, తృతీయాధిపతి శని తృతీయమైన కుంభంలో పంచమ, వ్యయాధిపతి కుజునితో కలయిక, షష్ఠమ, లా«భాధిపతి శుక్రుడు ఉచ్ఛస్థితి అయిన మీనంలో సప్తమ, దశమాధిపతి బుధుడు, రాహువులతో కలయిక. అష్టమాధిపతి చంద్రుడు సప్తమంలోనూ, దశమంలో కేతువుల సంచారం.

వీటిని బట్టి పరిశీలించగా శని,కుజుల కలయిక కారణంగా ఉన్మాదులు, ఉగ్రవాదులు తమ ప్రతాపాన్ని చూపే వీలుంది.

అక్టోబర్‌– డిసెంబర్‌ మధ్య కాలంలో వివిధ రకాల ప్రజాఉద్యమాలు, ఆందోళనలతో కొంత అశాంతి నెలకొనే అవకాశం ఉంది.

అపరాల ఉత్పత్తులు పెరిగి మంచి గిరాకీ ఏర్పడుతుంది.

కొన్ని వ్యాధులు సైతం ప్రబలి ప్రభుత్వాలకు సవాలుగా మారవచ్చు.

వైశాఖం, జ్యేష్ట మాసాలలో గాలిదుమారాలు, వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉంది.

జ్యేష్ఠ బహుళ పాడ్యమి శనివారం అనగా 22.06.24వ తేదీ ఉదయం 8.10 గంటలకు  రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. దీనివల్ల పంటలకు నష్టం, విపత్తులు, ధరల తగ్గుదల వంటి ఫలితాలు ఉంటాయి.

ఇక ఈ ఏడాది పశుపాలకుడు యముడు, గోష్ట బహిష్కర్త బలరాముడు కావడంవల్ల పాల ఉత్పత్తులకు అవరోధాలు, పశుగ్రాసం కొరత, పశువులకు రోగభయాలు ఉండవచ్చు.

వచ్చే ఏడాది శ్రీవిశ్వావసునామ సంవత్సరం.

నవనాయకుల ఫలాలు.

రాజు– కుజుడు...అగ్నిభయాలు, తక్కువ వర్షాలు, దేశంలో అలజడులు, యుద్ధభయాలు, కొన్ని దేశాలతో విరోధం.

మంత్రి– శని.. పంటల ఉత్పత్తులలో తగ్గుదల, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, ధాన్యం ధరల పెరుగుదల, ప్రజలకు రక్షణ కరవు, రోగాల భయం వంటి ఫలితాలు ఉంటాయి.

సేనాధిపతి –శని..నల్లని ధాన్యాలు, నల్లటి భూములు బాగా పండుతాయి. పాలకులకు యుద్ధకాంక్ష తద్వారా సైనిక నష్టం, ఎటుచూసినా యుద్ధ తీవ్రతలతో ప్రజలు ఆందోళన చెందుతారు. రాజకీయ ఒడిదుడుకులు. 

ఆర్ఘ్యాధిపతి –శని...వర్షాలు సామాన్యం. దొంగతనాలు, అగ్ని, రోగ భయాలు. ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల, మినుములు, నువ్వులు, బొగ్గు,సీసం, ఇనుము ధరలలో తగ్గుదల.

మేఘాధిపతి –శని...కొత్త వ్యాధులు, శీతల గాలులు పెరుగుతాయి. పాలకుల్లో ఐక్యత లోపించడం, పరస్పర వైరం.

సస్యాధిపతి(పూర్వ) –చంద్రుడు.. మాగాణి, మెట్టపంటలు బాగా పండుతాయి. చింతపండు, మామిడి, గోధుమలు, తమలపాకులు, చెరకు ధరలు సరసముగా ఉంటాయి.

ధాన్యాధిపతి– కుజుడు...కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రటి భూమలు బాగుగా పండుతాయి. బెల్లం,పంచదార, నూనెగింజలు, నూనెలు, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.

రసాధిపతి– గురువు...బంగారం, వెండి, పట్టు, పత్తి, బెల్లం, చెరకు, వస్త్రాల ధరలు అందుబాటులోకి వస్తాయి. వర్షాలు సమతూకంగా ఉంటాయి.

నీరాసాధిపతి– కుజుడు..ఉద్యానవనాల యజమానులకు విశేష లాభాలు, బంగారం, రక్త చందనం ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మిర్చి,పొగాకు,ఇనుము, ఉక్కు, రాగి, ఇత్తడి ధరలు పెరిగి స్థిరంగా ఉంటాయి. అపరాల (పప్పులు)ధరలు పెరుగుతాయి. ధాన్యం, బియ్యం ధరలు స్థిరంగా ఉంటాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download