సంక్రాతి పండుగ యొక్క విశిష్ఠత

సంక్రాతి పండుగ యొక్క విశిష్ఠత

 

 

సంక్రాతి పండుగ యొక్క విశిష్ఠత

మన సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు జరుపుకొంటాము. హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఎన్నో  ఆధ్యాత్మిక,సామాజిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అన్ని ఆచారాలు కూడా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశింపబడ్డాయి. అలాంటి పండుగలలో ముఖ్యమైనదిగా చెప్పబడేది సంక్రాంతి. వివిధ ప్రదేశాలలో, వేరు వేరు జాతుల వారు తమ తమ ఆచారాలకు అనుగుణం గా అందరు కలసి జరుపుకొనే ఒక ఆహ్లాదకరమైన సంబరం.

భోగి - శిశిర ఋతువు లో వస్తుంది. ఆకులు రాలేకాలం. ఉపయోగ పడని పాత వస్తువులు , రాలి పడే చెట్ల ఆకులు కొమ్మలు మంట వేయడం ద్వారా శుభ్ర పరచుకోవడం ప్రధాన లక్ష్యం. భోగి మంటలు పాత వస్తువులను త్యజించి వస్తువుల పై వ్యామోహం పెట్టుకోకూడదనే సంకేతం కూడా ఈ చర్య ద్వారా తెలుస్తుంది. మహిళలు సూర్యోదయమునకు ముందే లేచి రకరకాల ముగ్గులు వేయటం ద్వారా శరీరం వంగి లేవటం వలన మంచి వ్యాయామం జరిగి శరీరానికి ఉష్ణం మరియు ఆరోగ్యం కలుగుతాయి.

 ధనుర్మాసం లో నెల రోజులు ఆవు పేడ తో కళ్ళాపు చల్లి బియ్యపు పిండి తో ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి , గుమ్మడి పూలు (అత్యంత శక్తి ని ఇచ్చే ఆహార పదార్దం గుమ్మడి) వాటి మధ్య ఉంచటం ద్వారా వ్యాధి కారక సూక్ష్మ క్రిములను నిరోధించి సంపూర్ణ ఆరోగ్యం పొందగలుగుతాం.

సాయంకాలం భోగి పండ్లు పోయుట అనే ప్రక్రియ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో నిర్వహిస్తారు . రేగు పండ్లను బదరీ ఫలాలు అని కూడా అంటారు, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కాలం లో జీర్ణ శక్తి మందగిస్తుంది, మలబద్దకం వంటి సమస్యలు అధికం అవుతాయి, జీర్ణ వ్యవస్థ సక్రమం గా పని చేయడానికి ఈ పండ్లలో ఉండే జిగట పదార్ధం తోడ్పడుతుంది  కనుక ఈ కాలం లో వీటిని ఉపయోగించి ఆరోగ్య ఫలితాలు పొందవచ్చని పెద్దలు తెలియ జేశారు. ఆధ్యాత్మిక కోణం లో రేగు పండ్లు యోగిత్వానికి ప్రతీకగా చెప్ప బడ్డాయి.

 ఈ కాలం లో పీచు పదార్దములు (తేగ) మరియు పిండి పదార్దముల ద్వారా మలబద్దకం నివారించుకోవటం. ) ఈ పండుగ లో మరో ముఖ్యమైన పదార్దాలు నువ్వులు, బెల్లం సత్వ గుణం కలిగినటువంటి వీటిని వీటిని తినడం వలన శరీరం లో చలిని తగ్గించి వేడిని కలుగచేస్తాయి.వీటి తో తయారు చేసిన తీపి పదార్దాలను ఇతరులకి పంచడం ద్వారా సత్వ గుణం వృద్ది చెంది మంచి వాతావరణం నెలకొంటుంది.

సంక్రాంతి - ప్రకృతి లో సంపూర్ణ మార్పు వస్తుంది. నక్షత్ర గ్రహ మండలాలు ఈ రోజు ధనుస్సు ఆకారం లో ఉంటాయి. సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం.  సూర్యుడు మకర రాశి లో ప్రవేశించడం ద్వారా చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త పంట చేతికి రావటం ద్వారా కొత్త కుండలో పాయసం వండి అందరికి పెట్టి ఆనందం గా గడుపుతారు. గతించిన పెద్దలను ప్రత్యేకం గా పూజించి వారి ఆశీస్సులను పొందుతారు.

కనుమ - మనది గ్రామీణ భారత దేశం మనకు వ్యవసాయానికి మూలాధారమైన పసువులను పూజించడం ప్రత్యేకత. శ్రమకు కృతజ్ఞతా తెలుపుకొనే రోజు. భారతీయ సంస్కృతి లో పశుపక్షాదులను సైతం పూజించి సేవిస్తాం. సంవత్సరమంతా కష్టపడి పశువులతో వ్యవసాయ పనులు చేయించుకొని పంట ఇంటికి తెచ్చుకొంటారు. ఈ రోజు రైతులు వాటిని అలకరించి, విశ్రాంతి నిచ్చి కృతజ్ఞత తెలుపుకొంటారు.

ముక్కనుమ - మన సమీపంలోని చెరువులు , కాలువలు, నదులలో ఉండే చేపలు లాంటి జీవ రాశులకు, జలాల ప్రక్షాళనకు కాలుష్య నివారణకు పసుపు, మామిడి ఆకులు, గొబ్బెమ్మ లను నీళ్ళలో కలుపుతారు తద్వారా ఆరోగ్యవంతమైన నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇరుగు పొరుగు అందరూ కలిసి ఆనందం గా ఆట పాటలతో సంతోషం గా గడుపుతారు. తద్వారా దేశం లో ఐకమత్యం పెరిగి ప్రజలు సుభిక్షం గా ఉంటారు.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download