ఉగాది కృత్యం

ఉగాది కృత్యం

ఉగాది కృత్యం

-----------------

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమాçనం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు.

పంచాంగ శ్రవణం ద్వారా దేశ కాలమాన పరిస్థితులు,  జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

పంచాంగ సారాంశం

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో  కూడినదే పంచాంగం. పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. శత్రు, రుణ బాధలు, చెడు ఫలితాలు తొలగుతాయని నమ్మకం.

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ ప్లవనామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 35వది ప్లవ నామ సంవత్సరం. అధిపతి బుధుడు. బుధుడు, ఈ గ్రహాధిదేవత శ్రీ మహావిష్ణువును ఆరాధించిన బుద్ధి కుశలత, వాక్పటిమ, మనోనిబ్బరం కలుగుతాయి.

 

సంవత్సర ఫలితాలు..

ప్లవనామ సంవత్సరానికి రాజు, ఆర్ఘాధిపతి, సైన్యాధిపతి, మేఘాధిపతి కుజుడు, మంత్రి బుధుడు, పూర్వసస్యాధిపతి, నీరసాధిపతి శని, రసాధిపతి చంద్రుడు, అపర సస్యాధిపతి గురువు. ఇక నవనాయకుల్లో ముగ్గురు శుభులు, ఆరుగురు పాపులు అయ్యారు.

పశుపాలకుడు, సంరక్షడు కూడా యముడే అయినందున పశుసంపదకు నష్టం, పాల ఉత్పత్తుల పై ప్రభావం పడుతుంది.

అలాగే, రవి  మధ్యాహ్న సమయంలో ఆరుద్రా నక్షత్ర ప్రవేశం వల్ల వ్యవసాయానికి కొంత అరిష్టం. అలాగే, తెల్లవారుజామున రవి మేష రాశి ప్రవేశంచే ప్రపంచానికి విపత్తులు.

ఈ రీత్యా చూస్తే రాజాధిపత్యం కుజునికి దక్కడం, మంత్రి బుధుడు  కావడం వల్ల పాలన సాఫీగా సాగుతుంది.

చక్కటి ఆలోచనలతో పాలకులు ప్రజల అవసరాలు తీరుస్తారు.

అయితే పాలకుల్లో తామసం పెరుగుతుంది, తద్వారా పరస్పర విభేదాలు.

పాలనపరంగా ఊహించని మార్పులు సంభవం.

మంత్రి బుధుడు వల్ల ఆర్థిక క్రమ శిక్షణ పెరుగుతుంది.

ప్రజల్లో పొదుపు చర్యలు పెరుగుతాయి.

కేంద్ర,రాష్ట్రాల సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.

అయితే కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

ప్రభుత్వ సంస్థలు, ఔషధ సంస్థలు, అభివృద్ధి బాటలో నడుస్తాయి.

కమ్యూనికేషన్, ఐటీ రంగాలు మరింత విస్తృతమవుతాయి.

చలన చిత్ర పరిశ్రమ, ఇతర కళారంగాలకు గత సంవత్సరం కంటే కొంత మెరుగుదల కనిపిస్తుంది.

శాస్త్ర పరిశోధనలలో కొత్త పుంతలు తొక్కి మన దేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తుంది.

ఊహించని విధంగా అణు పరీక్షలు వంటివి జరిగే అవకాశాలున్నాయి.

ఇక ఇరుగుపొరుగు దేశాల మధ్య సత్సంబంధాల కోసం యత్నించినా కొన్ని అవాంతరాలు, ఉద్రిక్తతలు తప్పకపోవచ్చు.

రక్షణ చర్యల కోసం ప్రభుత్వం మరింత వెచ్చించే వీలుంది.

కొందరు నాయకులకు ఈ సంవత్సరం గడ్డుకాలమనే చెప్పాలి.

వ్యవసాయ, పౌల్ట్రీ రంగాలు మరింత అభివృద్ధి పథంలో సాగుతాయి.

వ్యవసాయదారులకు మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి.

ఎరుపు రంగు పంటల ఉత్పత్తులు పెరుగుతాయి.

సెనగలు, ధాన్యం,  గోధుమలు, నూనెగింజల ఉత్పత్తులు కూడా బాగా పెరుగుతాయి.

వ్యాపార, వాణిజ్య వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో లాభాలు గడిస్తారు.

ఒక వింత వ్యాధి ప్రబలి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలున్నాయి.

ఇక నిత్యావసర ధరలు ప్రారంభంలో మరింత పెరిగి క్రమేపీ తగ్గుదల కనిపిస్తుంది.

ముఖ్యంగా బంగారం ధరలు ఆకాశాన్నంటవచ్చు.

అలాగే, పప్పు ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి. 

స్టీల్, సిమెంట్‌ ధరలు కూడా పెరిగే సూచనలున్నాయి.

ప్రజల్లో దైవ భక్తి పెరుగుతుంది.

ప్రార్ధనా మందిరాలకు భక్తుల తాకిడి అధికమవుతుంది.

యజ్ఞయాగాది క్రతువులు విరివిగా జరుగుతాయి.

దేశంలోని ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మధ్య ప్రాంతంలోని కొన్నిచోట్ల అతివృష్టి, తద్వారా పంటలకు నష్టాలు.

దేశంలో మత, కులపరమైన ఘర్షణలు తలెత్తి ఉద్రిక్తతలు నెలకొంటాయి.

శనైశ్చరుడు ఈ ఏడాదంతా మకర రాశిలో సంచరించడం వల్ల ప్రజల్లో భయాందోళనలు, మానసిక ఆందోళనలు, తరచూ ఘర్షణలు జరుగుతాయి.

కుజ, గురువుల సమసప్తక సంబంధం....జూలై 13 నుండి ఆగస్టు 16 మధ్య కాలంలో గురు, కుజుల సమసప్తక(కుంభం, సింహరాశుల్లో సంచారం) సంబంధం వల్ల సుభిక్షం, ప్రజారోగ్యంలో మెరుగుదల, ధార్మిక కార్యక్రమాల పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది.

గురు, శని కలయిక ప్రభావం...2021 సెప్టెంబర్‌14 నుంచి 2021 నవంబర్‌ 20 మధ్యకాలంలో శని, గురులు మకరంలో కలయిక వల్ల మధ్య దేశంలో ప్రజల మధ్య మనస్పర్థలు, అలజడులు వంటి ఫలితాలు. ప్రకృతి వైపరీత్యాలతో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో తుపాన్లు, వరదలు సంభవించవచ్చు.

కాల సర్పదోషం...డిసెంబర్‌4వ తేదీ నుండి 2022 ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ కాల సర్పదోషం కారణంగా దేశారిష్ట యోగాలు కలుగుతాయి. ప్రకృత్తి వైపరీత్యాలు, రోడ్డు, విమాన ప్రమాదాలు–కొంత జన నష్టం. భూకంపాది ప్రమాదాలు,  పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం, ధరలు అధికం కావడం వంటి ఫలితాలు.

చాతుర్గ్రహకూటమి....2022 మార్చి 1 నుండి 4వ తేదీ వరకు దేశంలో తీవ్ర ఘర్షణలు, వ్యాధుల తీవ్రత పెరుగుదల, ప్రభుత్వాల మధ్య వివాదాలు, జల సంబంధిత వివాదాలు ఉండవచ్చు.

 

 

నవనాయక ఫలాలు.

1.రాజు –కుజుడు....అగ్ని, శస్త్ర భయాలు, పంటలకు కొంత నష్టం,సైన్యం అవసరాలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో రక్త పాతం.

2.మంత్రి–బుధుడు....ధనధాన్య వృద్ధి. గోధుమలు, మినుములు, సెనగలు, పత్తి, వెండి, కాగితం ధరలు పెరుగుతాయి. పాలకులు చాకచక్యం, నేర్పుగా పాలన సాగిస్తారు.

3.ఆర్ఘాధిపతి–కుజుడు...యుద్ధ భయం, వర్తక, వ్యవసాయ రంగాలకు ఇబ్బందులు. మిర్చి, వేరు సెనగ, బంగారం, రాగి, ఇనుము ధరలలో హెచ్చుతగ్గులు.

4.పూర్వసస్యాధిపతి –శని...నల్లని ధాన్యాల ఉత్పత్తులు అధికమవుతాయి.  నల్లని భూములు బాగా పండుతాయి. నువ్వులు, పొగాకు, మినుముల ధరలు కొంత తగ్గే సూచనలు.

5.సేనాధిపతి–కుజుడు....రోగ భయాలు. యుద్ధభయం, ప్రజలు కష్టనష్టాలు భరించాల్సిన పరిస్థితి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. భయోత్పాతాలు.

6.రసాధిపతి –చంద్రుడు...నెయ్యి, నూనెగింజలు, కిరోసిన్, బెల్లం, చక్కెర, పాలు, చింత పండు ధరలలో పెరుగుదల.

7.నీరసాధిపతి–శని....రత్నాలు, ముత్యాలు, చందనం, వెండి, ఇత్తడి ధరలు కొంత తగ్గవచ్చు.

8.ధాన్యాధిపతి –గురువు...సువృష్టి, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.

9.మేఘాధిపతి–కుజుడు.. మేఘాలు బాగా వర్షిస్తాయి. గాలులు అధికంగా వీచి కొన్ని పంటలకు నష్టం కలిగించవచ్చు. ఎర్రని ధాన్యాలు బాగా ఫలిస్తాయి.

 

పుష్కర నిర్ణయం

శ్రీ ప్లవనామ సంవత్సర కార్తీక బహుళ విదియ, అనగా నవంబర్‌20వ తేదీ శనివారం రాత్రి గం.11.28లకు గురువు కుంభరాశి ప్రవేశం. 21వ తేదీ ఆదివారం నుంచి శ్రీ సింధునది పుష్కరాలు ప్రారంభమవుతాయి.

గ్రహణాలు

ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి బుధవారం అనగా మే 26వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కలిగినా మన తెలుగు రాష్ట్రాలలో కనిపించదు. అందువల్ల ఎటువంటి పరిహారాలు అవసరంలేదు.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download