అక్షయ తదియ విశిష్టత:

అక్షయ తదియ విశిష్టత:

అక్షయ తదియ విశిష్టత:

వైశాఖ శుద్ద తదియ నాడు ఈ పండుగను చేస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు  తెలియజేస్తున్నాయి. ఈ అక్షయ తదియ నాడు రోహిణి  నక్షత్రముంటే మరింత పుణ్యప్రదమని చెబుతారు. ఈరోజు చేసేటటువంటి హోమం. దానం, పితృదేవతలకు, చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది "అక్షయ తదియ" అనబడింది. ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయం గా ఉంటూ వృద్ది చెందుతుంది. ఈ అక్షయ తదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషం గా చెప్పబడింది.

కొన్ని ప్రాంతాలలో గౌరీదేవీకి డోలోత్సవం, కృష్ణునికి డోలోత్సవం చేస్తారు. ముత్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్దాలు నాన వేసిన సెనగలను వాయనమిస్తారు.ఈ రోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకొనే వారు ఉప్పును మానేసి చక్కర కలిపిన పేలపిండిని భుజిస్తారు. బదరీనారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకుని ఉంటుంది. పరశురాముని జయంతి కూడా ఈరోజు జరుపుకొంటారు .ధనానికి మూలం గా చెప్పే కుబేరుడి కి ధనాధిపతి  గా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు.శివుడు అన్నపూర్ణ దేవి దగ్గర  గుప్త రూపం లో బిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది.  

ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని  ఈ రోజే వ్రాయడం మొదలు పెట్టాడు, దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈరోజు కీ పొందగలుగుతున్నాం. శ్రీ కృష్ణుడు ద్రౌపది కి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు.

 బంగారు వెండి ని కొనాలాని ఎక్కడ కుడా శాస్త్రవచనం లేదు. ఈరోజు చేయవలసిన మంచిపనులు దానాలు గురించే ప్రస్తావించబడింది. భగవంతున్ని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే  వారికున్నదానిలో నలుగురి మంచి కోరి ఒకరికి సహాయం చేసే వారికి బీదవారికి తమ చేతనైన సహాయం చేసేవారికి, భగవంతుని కృప తో అంతకి కోటి రెట్ల రూపం లో మనకి చేరుతుందని తెలుస్తుంది.

 కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. ఆ తర్వాత  నీటి కుండను వేసవిలో పండే పంటలు, యవలు, గోధుమలు, సెనగలు మొదలైనవి మరియు పెరుగు అన్నం దానం చేయాలి. అలా చేస్తే శివ సాయుజ్యం లభిస్తుందని భవిష్య పురాణం, దేవీపురాణం తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువికి చందనం లేపనం చేయడం వల్ల , నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రం లో స్వామి వారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మటుకే చందనం తీసి మళ్ళీ అలంకరిస్తారు.  ఈ రోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధమును చేయాలి. ఈ వైశాఖ శుక్ల తదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రములు, నీటితో నిండిన కుండను దానమివ్వడం మహా పుణ్యమని భవిష్యోత్తర పురాణం లో చెప్పబడింది.

ఈ రోజు సూర్య చంద్రులిద్దరు తేజోవంతం గా ఉంటారు కావున దానాలకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రతి ఘడియ కుడా ఎంతో విశేషమైనది గా చెప్పబడింది.ఈరోజు కొన్ని ప్రత్యేకమైన  దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలం.

తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడం అనంత పుణ్య ఫలం లభిస్తుంది.

గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలత తో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు.

పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది. మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణ తో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

గోధుమలు , నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లైతే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి.

కంచు గిన్నె లో నీటి ని పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణ తో సహా దానమిస్తే గయా లో శ్రాద్ధ చేసిన ఫలితం కలుగుతుంది. ముఖ్యం గా పెళ్లి కావాలనుకొనే వారు, పితృ శాపాలు ఉన్న వారు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది

ముఖ్యం గా ఈరోజు చెట్లని నాటడం అనంత ఫలాన్నిస్తుంది, ఎప్పటికి తరిగిపోని పచ్చదనం భూమి పై పెరుగుతుంది. ప్రకృతిని పూజించి ఔషద మొక్కలను ఈ రోజు నాటి నట్లైతే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి.

 

 

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download