శుభకృత్ నామ గ్రహసంచార ఫలితాలు

శుభకృత్ నామ గ్రహసంచార ఫలితాలు

ఓం గణేశాయనమః

––––––––––––––––

ఉగాది కృత్యం

–––––––––––––––––

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. పాడ్యమి తిథి ప్రవేశ సమయాన్ని వర్ష లగ్నంగానూ (తెలుగు ఉగాది), రవి మేష రాశిలో ప్రవేశ సమయాన్ని(తమిళ సంవత్సరాది) జగల్లగ్నంగానూ నిర్ణయిస్తారు. ఆయా  రోజుల్లో ఉండే గ్రహస్థితులను అనుసరించి భవిష్యత్తు ఫలాలు నిర్ణయం జరుగుతుంది.

పంచాంగ శ్రవణం ద్వారా దేశ కాలమాన పరిస్థితులు,  జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

పంచాంగ సారాంశం

–––––––––––––––––––––––––

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో  కూడినదే పంచాంగం. పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. శత్రు, రుణ బాధలు, చెడు ఫలితాలు తొలగుతాయని నమ్మకం.

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీశుభకృత్‌నామ సంవత్సరంగా  పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 36వది శుభకృత్‌ నామ సంవత్సరం.  ఈ ఏడాది దేవగురుని, పరమేశ్వరుడిని,  శ్రీ మహావిష్ణువు, దత్తాత్రేయ స్వామిని ఆరాధించిన జ్ఞానవృద్ధి, ఉన్నతాశయ సిద్ధి కలిగి సుసంపన్నులు కాగలరు. 

 

సంవత్సర ఫలితాలు

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరానికి రాజు, నీరసాధిపతి శని, మంత్రి  గురుడు, సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి బుధుడు, పూర్వసస్యాధిపతి రవి, అపర సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి కుజుడు. నవనాయకుల్లో ఐదుగురు శుభులు, నలుగురు పాపులు అయ్యారు.

పశుపాలకుడు, సంరక్షకుడు కూడా బలరాముడైనందున పశువృద్ధి, పాడిపరిశ్రమ మరింత అభివృద్ధిపథంలో సాగుతుంది. డెయిరీలు మరింత ప్రగతి సాధిస్తాయి.

అలాగే, రవి రాత్రి సమయంలో (22.06.22వ తేదీ బుధవారం) ఆరుద్రా నక్షత్ర ప్రవేశం వల్ల సమస్త జీవరాశులకు శ్రేయస్కరం. పూర్వాహ్ణ కాలమందు (14.04.22వ తేదీ గురువారం ఉదయం 10.54 గంటలకు)  రవి మేష రాశి ప్రవేశంతో అగ్నిభయాలు, ప్రపంచంలో సన్మార్గం పై దుర్మార్గుల ఆధిపత్యం, ప్రజల మధ్య కలహాలు, వివిధ రకాల వ్యాధులు సంభవించవచ్చు. అలాగే, ధాన్యాలు వంటి పంటలకు ధరలు పెరుగుతాయి.

ఈ ఏడాది రాజు శని, మంత్రి గురుడు ఇద్దరూ మిత్రులు, శత్రువులు కాకుండా సములు కావడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రానికి వివాదాలు రావచ్చు. అయితే పరస్పర సర్దుబాటుతో సమసిపోతాయి. అయితే అనూహ్యంగా కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాల మార్పు గోచరిస్తున్నది.  మొత్తం మీద దేశపాలన సవ్యంగా సాగుతుంది. నాయకులు సమర్థతను చాటుకుంటారు. ఆర్థిక వ్యవస్థ గాడినపడి వృద్ధిరేటు పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులు మరింత పెరిగి గణనీయమైన ప్రగతి ఉంటుంది. నిత్యావసరాలు, వెండి, బంగారం వంటి లోహాల ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నా అదుపులోనే ఉంటాయి. మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో రాజకీయ సంఘర్షణలు, పోలీసు చర్యలు తద్వారా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనవచ్చు. అలాగే, కొన్నిచోట్ల సైనిక చర్యలకు ఆస్కారం కనిపిస్తున్నది. అలాగే, కశ్మీర్, బెంగాల్‌ రాష్ట్రాల్లో అలజడులు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులు ఈ ఏడాది ఎంతో ఉత్సాహంతో గడుపుతారు. అలాగే, వైద్యవృత్తుల వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. దేవగురుడు ఏప్రిల్‌ 13 (2022)నుండి స్వక్షేత్రమైన మీన రాశిలో ప్రవేశంతో మరింత సుభిక్షంగా ఉంటుంది. వర్ష, జగలగ్నాలు మిథునమే కావడం, లగ్నానికి గురుడు రాజ్యస్ధానంలో ఉండడం శుభకరం.

గతం కంటే పాడిపంటలు సమృద్ధిగా ఉండే సూచనలు. విద్య, సాంస్కృతిక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన పరిశోధనలతో మన దేశం ఖ్యాతి పొందుతుంది. ఊహించని విధంగా ఆయుధ పరీక్షలు వంటివి నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. ఏడాది మధ్యలో నాయకుల మధ్య పరస్పర వైరం ఏర్పడి కొన్ని పార్టీల్లో సంక్షోభం తలెత్తే వీలుంటుంది.

అలాగే, కొన్ని వ్యాధులు ప్రబలి  ప్రజలను కలవరపరుస్తాయి. అయితే  ప్రభుత్వాలు తీసుకునే చర్యల కారణంగా అదుపులోకి రాగలవు.  మంత్రి గురుడు కావడం వల్ల ప్రజల్లో బుద్ధికుశలత పెరుగుతుంది. పాలకులకు సరైన మార్గదర్శనం లభిస్తుంది.

వ్యవసాయపరంగా రైతులకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. తద్వారా వారు పంటల విస్తీర్ణాన్ని పెంచుతారు. పంటల ఉత్పత్తులు కూడా అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం గోధుమలు, పప్పుదినుసులు, నువ్వు పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. రైతులు గిట్టుబాటు ధరలు దక్కి ఊరట చెందుతారు.

 

నవంబర్‌ 11 నుండి కుజుడు వృషభరాశిలో వక్రస్తంభన కారణంగా ఐరోపా దేశాలలో అలజడులు, యుద్ధభయాలు వంటివి కలుగవచ్చు. దేశాధినేతలకు ఇబ్బందులు. భూకంపాలు వంటి ప్రకృత్తి వైపరీత్యాలు సంభవించవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలు తుఫాన్లు, ఉప్పెనలు వంటి వాటితో సతమతమయ్యే సూచనలు. ఇక తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అధిక వర్షాలు, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం. స్టీల్, సిమెంట్‌ ధరలు కూడా పెరిగే సూచనలున్నాయి. ప్రజల్లో దైవ భక్తి పెరుగుతుంది.

 

కర్తరీ నిర్ణయం

04.05.22వ తేదీ వైశాఖ శు.చవితి బుధవారం నుండి సాధారణ కర్తరి ప్రారంభం. 11.05.22వ తేదీ వైశాఖ శు.ఏకాదశి బుధవారం నుండి నిజకర్తరి(అగ్నికర్తరి) ప్రారంభమై 29.05.22వ తేదీ ఆదివారంతో ముగుస్తుంది.

మూఢమి

శుక్ర మూఢమి....18.09.22వ తేదీ భాద్రపద బహుళ నవమి ఆదివారం రాత్రి శుక్రమూఢమి ప్రారంభమై 27.11.22వ తేదీ మార్గశిర శు. పంచమి ఆదివారం రాత్రి ముగుస్తుంది. 

 

పుష్కర నిర్ణయం

శ్రీశుభకృత్‌ నామ సంవత్సర చైత్ర శుద్ధ ద్వాదశి, అనగా 13.04.22 వ తేదీ బుధవారం, మధ్యాహ్నం గం.3.48 ని.లకు బృహస్పతి(గురుడు) స్వక్షేత్రమైన మీనరాశిలో ప్రవేశంతో ప్రణీతానదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రణీతనది గోదావరికి ఉపనది. ఇది మహారాష్ట్రలో పుట్టి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.

గ్రహణాలు

ఈ ఏడాది ఒక సూర్యగ్రహణం, ఒక చంద్ర గ్రహణం ఏర్పడతాయి.

 

సూర్య గ్రహణం

ఆశ్వయుజ అమావాస్య అనగా 25.10.22వ తేదీ మంగళవారం సాయంత్రం 5.02 గంటలకు కేతుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. మోక్ష కాలం సా.6.27 గంటలకు కలుగుతుంది. ఇది స్వాతి నక్షత్రంలో ఏర్పడుతున్నందున ఈ నక్షత్రం వారు, తులారాశి వారి చూడరాదు.

చంద్రగ్రహణం

కార్తీక పౌర్ణమి అనగా 08.11.22వ తేదీ మంగళవారం, మధ్యాహ్నం 2.39 గంటలకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆరోజు చంద్రోదయం సా.5.27 గంటలకు గాన ప్రారంభం కనబడదు. అయితే సాయంత్రం 5.27 గంటల నుంచి గ్రహణ చంద్రుని వీక్షించవచ్చు.  మోక్ష కాలం సా.6.19 గంటలకు కలుగుతుంది. ఇది భరణి నక్షత్రంలో సంభవిస్తుంది. అందువల్ల ఈ నక్షత్రం, మేష రాశి వారు చూడరాదు.

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download