ధన త్రయోదశి విశిష్ఠత

ధన త్రయోదశి విశిష్ఠత

 

 

ధన త్రయోదశి విశిష్ఠత

ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి మరియు ధన త్రయోదశి ని జరుపుకొంటారు. ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆద్యకర్త గా భావిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు. పురాణాల్లో ధన్వంతరి ని దేవ వైద్యునిగా చెప్పబడింది. ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ధన్వంతరి ని పూజిస్తారు. సకల సుఖాలను అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. సకల రోగాల విముక్తికై ధన్వంతరిని పూజించాలి. ముఖ్యం గా దీర్ఘకాలిక వ్యాదులతో భాదపడేవారు ధన్వంతిరి ని పూజించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధన త్రయోదశి రోజున కుబేరుణ్ణి శ్రద్ధతో స్మరించి పూజిస్తే అక్షయ సంపదలు కలుగుతాయి.

దక్షిణ భారత దేశం లో ధన త్రయోదశి ని ఐశ్వర్య, సౌభాగ్యదాయక శుభదినం గా నిర్వహించుకొనే పద్దతి ఉంది. దీనికి సంబంధించి  అనేక కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి. పూర్వం హిమవంతుడనే రాజుకు లేక లేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారిడికి జాతకరీత్యా పదహారవఏట వివాహమైన నాలగవ రోజున పాము కాటుకు గురై చనిపోతాడని చెబుతారు. దానితో ఆ రాకుమారుడి భార్య వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలని రాశులుగా పోసి ఆ రాత్రి శ్రీ హరి వైభవాన్నిపూజిస్తుంది.రాకుమారుడి ప్రాణాల కోసం సర్ప రూపం లో వచ్చిన యమునికి ఆ దీప కాంతి, బంగారం వెండి ధగధగలకు కళ్ళు మిరుమిట్లు గొలిపి, కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చిన పని మరచి తెల్లవారిన తర్వాత తిరిగి వెళ్ళిపోయాడని చెబుతారు.

అందుకే స్త్రీలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. అందుకే ఈనాడు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధన లక్ష్మి ని పూజిస్తారు. దీనినే యమ త్రయోదశి గా కూడా జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.

 ధన త్రయోదశి నుండి, ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్ధం దీపాన్ని వెలిగించి, అక్షింతలు, పూలు గంధాదులతో  పూజించి ఇంటి ముందు ఉంచుతారు. దీనినే యమ దీపం అంటారు. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతదేశం లో బాగా ప్రాచుర్యం లో ఉన్నది. అందుకే ఈ రోజున సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నం రాశి మీద దీపాన్ని పెడతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download