పుష్య మాసం విశిష్ఠత

పుష్య మాసం విశిష్ఠత

 

పుష్య మాసం విశిష్ఠత

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం  శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు  వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. ఈ మాసం లో రైతులకి పంట  చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.

పంచాయతన పూజావిధానంలో గణపతిని భాద్రపద మాసంలో, అంబికా అమ్మవారిని ఆశ్వీయుజ మాసంలో, శివుని కార్తీక మాసంలో, విష్ణువుని మార్గశిర మాసంలో, సూర్యనారాయణుని పుష్య మాసంలో విశేషంగా కొలుస్తారు.

గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీ కృష్ణుని వివాహం చేసుకుంది పుష్య మాసంలోనే. పెళ్ళి కాని ఆడ పిల్లలు వివాహం కోసం ఈ మాసంలో కాత్యాయనివ్రతం ఆచరిస్తారు.

పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్య మాసం శనీశ్వరుడికి ప్రీతికరమైన మాసం గా చెప్పబడింది. పుష్య మాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటి తో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. శనీశ్వరునికి ప్రీతికరమైన  నువ్వులు, బెల్లం ఆహారం  లో తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది, ఇదే అంశాన్ని శాస్త్రీయ కోణం లో పరిశీలిస్తే ఈ రెండు పదార్థాలు ఒంట్లో వేడి ని కలిగించి చలి నుండి రక్షణ కలిగిస్తాయి. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. ఈ మాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.

 

పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా శ్రీ హరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు.

ఇక, శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం.

తెలుగువారి పెద్ద  పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే, ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

ఈ మాసం  లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి   శుభకార్యాలు  చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు.

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download