యమ ద్వితీయ పండుగ విశిష్ఠత

యమ ద్వితీయ పండుగ విశిష్ఠత

యమ ద్వితీయ పండుగ విశిష్ఠత:

కార్తీక మాసం ప్రారంభమయ్యే రెండవ రోజు  వచ్చే విదియ తిథిని యమ ద్వితీయ లేక భ్రాతృ ద్వితీయ గా జరుపుకొంటారు. తోడబుట్టిన ఆడ సంతానాన్ని, భగినీ అంటారు ఆమె చేతితో వండిన భోజనం చేయడాన్ని భగినీ హస్త భోజనం అంటారు . పురాణ కథనాన్ని అనుసరించి యమ ధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి తన పరివారం తో వెళ్ళి ఆమె స్వయంగా చేసిన పదార్థాలని భుజించి సంతుష్టుడౌతాడు. సంతోషం తో ఆమె ని వరం కోరుకోమనగా ఎవరైతే కార్తీక శుద్ధ విదియ రోజున తమ సోదరి చేతి భోజనాన్ని స్వీకరిస్తారో వారికి యమ బాధలు కలగకూడదని వరం కోరుకొన్నది. యమ ధర్మరాజు సంతోషం తో ఆమె కోరిన విధం గా వరాన్ని ప్రసాదిస్తాడు.

ఈ కథ వెనుక అంతరార్థాన్ని పరిశీలిస్తే , వివాహమయిన స్త్రీ అత్తవారింట ఎలా ఉన్నదో కనీసం సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి ,అక్కడ స్థితిగతుల ని క్షేమ సమాచారాలని , ఆమె పట్ల వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనలని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సోదరులు వారి ఇంటికి వెళ్తారు, తండ్రి తరువాత అన్న దమ్ములే తండ్రి తో సమానం కావున ఈ ఆచారం ఏర్పడింది అని తెలుస్తుంది. కుటుంబం లో ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబ సభ్యుల పట్ల  ఎంతో ఆప్యాయత ని ప్రేమాభిమానాలని కలిగి ఉండడం, ఒకరి కష్ట సుఖాలని మరొకరు పంచుకోవడం మన భారతీయ సంస్కృతి కి గొప్ప నిదర్శనం. కుటుంబాలు విడిపోకుండా ఉండడానికి ఇటువంటి సామాజిక సంప్రదాయాలు  ఎన్నో చూడవచ్చు.

ఈ రోజున ప్రతి సోదరుడు వారి సోదరి యొక్క ఇంటికి వెళ్లి ఆమె ఇంట భోజనం చేసి వారి శక్తానుసారం కట్న కానుకలు, పసుపు కుంకుమ, వస్త్రాభరణాలు ఇస్తారో అటువంటి వారికి అపమృత్యు దోషాలు దరిచేరవు, నరక బాధలు ఉండవు. అలాగే స్త్రీ తమ సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో అటువంటి స్త్రీ  సుమంగళి గా, సుఖ సంతోషాలతో జీవిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download