మేషం
ఆదాయం–14, వ్యయం–14, రాజపూజ్యం–3, అవమానం–6.
గ్రహసంచారాన్ని బట్టి పరిశీలిస్తే గురువు వ్యయంలో ఉన్నా స్వక్షేత్రం, సువర్ణమూర్తి కావడం శుభప్రదం.
అలాగే, శని మూడు నెలల పాటు లాభ స్థితిలో శుభుడు.
ఆదాయం మరింత వృద్ధి చెంది అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
అలాగే, శుభకార్యాల రీత్యా ఖర్చులు చేయాల్సి వస్తుంది.
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు.
ఆత్మవిశ్వాసం, పట్టుదల, చాకచక్యం మీకు ఎంతగానో సహకరిస్తాయి.
ఆస్తుల వ్యవహారాలలో ఆప్తులతో ఇబ్బందులు తీరి లబ్ధి చేకూరుతుంది.
కొంతకాలంగా చికాకు పరుస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తమ లాభాలను పెంచుకుంటారు.
అలాగే, కొత్త సంస్థల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.
ఉద్యోగస్తులు పట్టుదలతో విధులలో లక్ష్యాలు సాధిస్తారు.
అలాగే, జూలై తరువాత మార్పులు, చేర్పులు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం వారు మరింత ప్రగతి సాధిస్తారు.
వ్యవసాయదారులకు మొదటి పంట విశేషంగా లాభిస్తుంది.
విద్యార్థులు చేసిన కృషికి తగిన ఫలితం దక్కించుకుంటారు.
రాజకీయవేత్తలు ప్రజాదరణతో ముందడుగు వేస్తారు.
అలాగే, ఊహించని కొన్ని పదవులు దక్కించుకుంటారు.
చిత్ర పరిశ్రమతో సహా వివిధ కళారంగాల వారు మొదటి మూడు నెలల కాలంలో అద్భుతమైన అవకాశాలు పొందుతారు.
వీరికి ఏ ఏడాది స్వగృహప్రాప్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు సంచారం, జూలై 12 నుండి శని తిరిగి దశమ స్థానంలో సంచారం వల్ల మానసిక అశాంతి. బంధువైరం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
పరిహారాలు…. వీరు శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం అవసరం.
అదృష్ట సంఖ్య–9.