ధనుస్సు
ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–7, అవమానం–5.
వీరికి గురుడు సెప్టెంబర్14 నుంచి నవంబర్20 వరకు ధన స్థానంలో సంచారం శుభదాయకం. ఇక ఏడాది ప్రారంభం, చివరిలో తృతీయస్థితి అనుకూలంకాకున్నా మూర్తిమంతం (రజిత, సువర్ణమూర్తి) కావడంతో కొంత శుభత్వాన్నిస్తాడు.
ఇక ఏల్నాటి శని ప్రభావంతోపాటు, కేతువు వ్యయ స్థితి అనుకూలం కాదు.
రాహువు షష్ఠమ స్థితి ఉచ్ఛరాశిలో సంచారం శుభదాయకం.
ఈరీత్యా పరిశీలిస్తే వీరికి గురువు, రాహువులు అనుకూల ఫలితాలు ఇస్తారు.
కొన్ని వ్యతిరేక సంఘటనలు ఎదురైనా ఆత్మవిశ్వాసం వీడక ముందుకు సాగుతారు.
గురుని అనుకూలత వల్ల ధన లబ్ధి. ఆస్తులు కొనుగోలు వంటివి ఉంటాయి.
అమోఘమైన వాగ్దాటి, విషయ విశ్లేషణా శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
కుటుంబ, సంతాన సౌఖ్యాలు.
అందరిలోనూ కీర్తిప్రతిష్ఠలు పొందే అవకాశం.
తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.
ఇక ఏడాది ప్రారంభం, చివరిలో గురుని ప్రభావం, ఏల్నాటి శని, కేతువుల వ్యయస్థితి వల్ల కుటుంబంలో కలహాలు.
చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు, మనోక్లేశాలు.
కొన్ని ఊహించని కష్టాలు. తద్వారా మానసిక అశాంతి.
శారీరక రుగ్మతలతో ఇబ్బంది పడతారు.
శత్రువుల పట్ల మరింత జాగరూకతతో మెలగాలి.
అయితే రాహువు అనుకూలత వల్ల ధైర్యం, పట్టుదల ఆయుధాలుగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు.
విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
వ్యాపార, వాణిజ్యవర్గాల కృషి కొంత ఫలిస్తుంది.
ఉద్యోగులు చివరిలో స్థాన చలనాలు పొందుతారు.
పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి మునుపటి కంటే కొంత అనుకూలమనే చెప్పాలి.
రాజకీయవేత్తలు కొన్ని పదవులు పొందినా ఏదో అసంతృప్తి కలుగుతునే ఉంటుంది.
వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి.
క్రీడాకారులు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి కొంత శ్రమానంతరం కృషి ఫలిస్తుంది.
మొత్తం మీద వీరికి మిశ్రమంగానే గడిచిపోతుంది.
దోష పరిహారాలు...
శనికి తైలాభిషేకాలు, శివాలయంలో అభిషేకాలు, కేతువుకు పార్వతీదేవికి కుంకుమార్చనలు, గురుదోష నివారణకు జపం, దానాలు ఇవ్వడం మంచిది.