కుంభం
ఆదాయం –5, వ్యయం –2, రాజపూజ్యం–5, అవమానం–4.
వీరికి గురుడు ధనస్థాన సంచారం వల్ల అనుకూలత ఉంటుంది. అలాగే, శని జన్మరాశిలో రజితమూర్తిగా సంచారం సమయం మూడు నెలల పాటు లాభదాయకంగా ఉంటుంది. ఇక రాహు, కేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు.
ఆదాయానికి వెతుకులాట కొంత తగ్గి ఊరట లభిస్తుంది.
తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. తద్వారా అలసట, శ్రమాధిక్యం.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వాములవుతారు.
వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
నిరుద్యోగులు ఏడాది ప్రారంభంలో శుభ ఫలితాలు సాధిస్తారు.
కార్యక్రమాలలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమించి పూర్తి చేస్తారు.
సమస్యలను అవలీలగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు.
విద్యార్థులు మరింత బుద్ధికుశలతతో మసలుకుని విజయాలు సాధిస్తారు.
ఇక జూలై నుండి శని వ్యయస్థితిలో సంచారించడం వల్ల లేనిపోని ఇబ్బందులు.
ఆర్థికంగా కొన్ని ఇక్కట్లు. రుణ యత్నాలు.
ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. తగిన ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉండాలి.
బంధువులు, స్నేహితులతో అకారణ వైరం.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ప్రథమార్ధంలో అభివృద్ధి దిశలో పయనించగా, ద్వితీయార్థం అంతగా కలసి రాకపోవచ్చు.
ఉద్యోగస్తులు ఎంత పని విధానం మెరుగుపర్చుకున్నా అధికారులతో మాటపడతారు.
పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు తమ నైపుణ్యతను ప్రదర్శించి కొంత శ్రమానంతరం లక్ష్యాలు సాధిస్తారు.
రాజకీయవేత్తలకు వ్యవహారాలలో అవాంతరాలు, పదవులు దూరమయ్యే అవకాశం.
చిత్రపరిశ్రమకు చెందిన వారు భారీ బడ్జెట్లతో నిర్మాణాల పై తొందరపడరాదు.
వ్యవసాయదారులకు మొదటి పంటలో లాభాలు అందుతాయి.
పరిహారాలు... వీరు శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.
అదృష్ట సంఖ్య-8.