మకరం
ఆదాయం–14, వ్యయం–14. రాజపూజ్యం–3, అవమానం–1.
మే 1వ తేదీ నుండి గురుని పంచమకోణస్థితి అత్యంత శుభదాయకం.
అలాగే, ఏల్నాటిశని నడుస్తున్నా మూర్తిమంతం చేత సువర్ణమూర్తి కావడం అనుకూలం.
రాహుకేతువులు కూడా శుభకారకులే.
వీరు తలచిన ఏ పనీ కూడా జాప్యం లేకుండా పూర్తి కాగలదు.
ఆర్థిక విషయాలు మునుపటి కంటే మరింత మెరుగుపడి ఉన్నతికి చేరుకుంటారు.
అయితే వివిధ రూపాలలో ఖర్చులు కూడా ఎదురవుతాయి.
ఇతరులకు చేయూతనివ్వడంలో ముందడుగు వేస్తారు.
సొంత ఆలోచనలే అమలు చేసి విజయాలు సా«ధిస్తారు.
వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి.
సోదరులు మీతో ఆస్తుల వ్యవహారంలో అంగీకారానికి వస్తారు.
విద్యార్థులకు విదేశీ విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి.
మీ మధ్యవర్తిత్వం కోసం బంధువులు ఎదురుచూస్తుంటారు.
ఎవరినీ నొప్పించని రీతిలో నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటారు.
ఇంటి నిర్మాణ కల నెరవేరే సమయం.
అలాగే, పెద్దవాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. అలాగే కొందరికి శస్త్ర చికిత్సలకు అవకాశం.
వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా లావాదేవీలు నడిపించి లాభాలు పొందుతారు.
ఉద్యోగస్తులు బాధ్యతలు నిర్వహించడంలో అప్రమత్తత పాటించడం ద్వారా గుర్తింపు పొందుతారు.
శాస్త్ర సాంకేతిక వర్గాల వారు కొత్త పరిశోధనల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు.
రాజకీయవేత్తలకు పదవీయోగం, న్యాయపరమైన వివాదాల నుండి విముక్తి.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఆత్మవిశ్వాసంతో కార్యాలను చక్కదిద్దుతారు.
కళాకారులకు అవకాశాలకు లోటు ఉండదు. కొందరికి అవార్డులు సైతం రావచ్చు.
వ్యవసాయదారులు రెండుపంటలూ అనుకూలించి ఉత్సాహంతో గడుపుతారు.
మహిళలకు మానసికంగా మరింత బలం చేకూరుతుంది.
చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి మరింత అనుకూలం.
వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం.